Site icon Prime9

AP EX CID Chief Sunil Kumar : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్

AP EX CID Chief Sunil Kumar

AP EX CID Chief Sunil Kumar

AP EX CID Chief Sunil Kumar : ఏపీ మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విదేశాలకు వెళ్లే సమయంలో అనుమతి తీసుకున్నప్పటికీ ట్రావెల్ ప్లానింగ్‌కు విరుద్ధంగా పర్యటించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆలిండియా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్దారణ కావడంతో సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు..
ఫైర్ సర్వీస్ డీజీగా ఉన్నప్పుడు, సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని, అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు అనుకూలంగా పనిచేశాడని పీవీ సునీల్‌పై మొదటి నుంచి టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసును సునీల్ కుమార్ ఎదుర్కొంటున్నారు.

ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి..
ఐపీఎస్ అధికారులకు విదేశీ ప్రయాణానికి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇచ్చే హక్కు ఉంది. అయితే, DOPT (2003) మార్గదర్శకాల ప్రకారం ముందుగా అనుమతి తీసుకోవాలి. పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ ముఖ్యం. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు పోలీసు సర్వీసు నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికారులు అధిక సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు. అనుమతిలేని పర్యటనలు జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించవచ్చునని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా పలుసార్లు విదేశీ యాత్రలకు వెళ్లినట్లు సునీల్ కుమార్‌పై అభియోగాలు ఉన్నాయి. అఖిలభారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు వ్యతిరేకంగా సునీల్ వ్యవహరించినట్లు భావిస్తూ డీజీపీ ర్యాంకులో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

Exit mobile version
Skip to toolbar