AP Budget 2024-25: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి ఊపిరి దొరికింది. గత 5 ఏళ్లు అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్.. పేదల పాలిట వరంగా మారింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ఆర్థిక ప్రగతి, విద్య, వైద్యం, వ్యవసాయానికి భారీగా కేటాయింపులు జరిగాయి. సవాళ్లను ఎదుర్కొంటూ… సంక్షేమ శకానికి నాంది పలుకుతామని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
రూ.2,99,427.25 కోట్లతో..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024-25 వార్షిక బడ్జెట్ తో ప్రారంభమయ్యాయి. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,99,427.25 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం రూ.32,712.84 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ద్రవ్య లోటు 68,742.65 కోట్లుగా వెల్లడించారు. అలాగే వివిధ రంగాలకు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రెవేటు పాఠశాల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పేదరికం కారణంగా ఎవరూ విద్యం దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సైతం ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అనంతరం సభను ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. మరోవైపు అన్ని రంగాలకు ప్రధాన్యత ఇచ్చేలా కేటాయింపులు జరపడంపై వివిధ రాజకీయ పక్షాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించారని చెబుతున్నారు.
కేబినెట్ ఆమోదం…
అంతకుముందు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్… 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి సహా డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను స్వీకరించారు. అంతకు ముందు వెంకటపాలెంలో దివంగత నాయకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. మంత్రులు నారా లోకేష్, నారాయణ, పార్థసారధి, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సభకు రాని జగన్, వైసీపీ సభ్యులు…
సోమవారం ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. దీంతో ఆ పార్టీ వైఎస్ జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరు కాలేదు. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. మాజీ సీఎం జగన్ రాకపోయినా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈనెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలందరికీ బడ్జెట్ పై మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అలాగే శనివారం సైతం సభ నిర్వహిస్తామని తెలిపారు. వివిధ బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు 2 పూటలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా చర్చ జరపడం సభ్యుల బాధ్యతని గుర్తుచేశారు.
వివిధ శాఖలకు కేటాయించిన నిధుల ఇలా ఉన్నాయి..
ఎస్సీ సంక్షేమానికి రూ.18,497 కోట్లు, ఎస్టీలకు రూ.7,557 కోట్లు, బీసీలకు రూ.39,007 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు
– మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.4,285 కోట్లు
– నైపుణ్య శిక్షణ ద్వారా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ శాఖకు రూ.1,215 కోట్లు
– తల్లికి వందనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, మెగా డీఎస్సీతోభ 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు విద్యా ప్రగతికి దోహదపడేలా పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్లు
– ఉన్నత విద్యా శాఖకు రూ.2,326 కోట్లు
– వైద్య, ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లు
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.16,739 కోట్లు
– ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న 204 అన్నా క్యాంటీన్లకు అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో మరో 158 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
– మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు రూ.11,490 కోట్లు
– ప్రధానమంత్రి ఆవాస యోజన – ఎన్టీఆర్ నగరాలు పథకం కింద 2029 నాటికి రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు
– గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి – జన్ మన్ పథకం కింద నిస్సహాయ గిరిజనులకు 15వేల ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదన
– మొత్తంగా గృహ నిర్మాణ శాఖకు రూ.4,012 కోట్లు
– కేంద్రం సహకారం జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తి చేస్తాం
– శ్రీకాకుళం జిల్లాలో బొడ్డుపల్లి రాజగోపాల రావు వంశధార ఫేజ్ – 2, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు, వంశధార – నాగావళి అనుసంధానం, గోదావరి – పెన్నా అనుసంధానం, రాయలసీమలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సహా జల వనరుల శాఖకు రూ.16,705 కోట్లు
– ఏపీ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అమలు, పరిశ్రమలు వాణిజ్య శాఖకు రూ.3,127 కోట్లు
– రవాణా, రోడ్లు, భవనాల శాఖకు రూ.9,554 కోట్లు
– యువజన, టూరిజం, సాంస్కృతిక శాఖకు రూ.322 కోట్లు
– శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం, రాజమండ్రిలో 4 కొత్త పోలీసు బెటాలియన్ల ఏర్పాటు
– మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, పోగాకు వ్యతిరేక కార్యక్రమాలు, ఉన్నత విద్యా సంస్థల్లో 3,172 యూనిట్ లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు
– పోలీసు శాఖకు రూ.8,495 కోట్లు
– అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.687 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు…
రాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను రూ.43,402 కోట్లతో ఆశాఖ మంత్రి అచ్చెంనాయుడు ప్రవేశ పెట్టారు. వ్యవసాయం రాష్ట్రానికి వెన్నెముక వంటిదని తెలిపారు. 62శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించారు. ఇందులో ప్రధానంగా…
– అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ అమలుకు రూ.4,500 కోట్లు ప్రతిపాదించారు. ఏటా రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
– వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు
– రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
– భూసార పరీక్షలకు రూ.98.88 కోట్లు
– విత్తనాల పంపిణీ రూ.240 కోట్లు
– ఎరువుల పంపిణీ రూ.40 కోట్లు
– పొలం పిలుస్తోంది రూ.11.91 కోట్లు
– ప్రకృతి వ్యవసాయం రూ.422. 96 కోట్లు
– ఎన్టీఆర్ జలసిరి రూ.50 కోట్లు
– ఉద్యానవన శాఖకు రూ.3,469.47 కోట్లు
– ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేలా పంటల బీమా (క్రాప్ ఇన్సూరెన్స్) కు రూ.1023 కోట్ల కేటాయింపు
– రాయలసీమ, ఇతర వర్షాభావ ప్రాంతాల్లో 3 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించేందుకు, రాయితీపై డ్రిప్, స్పింకర్లు అందించడానికి రూ.2,700 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికలు పంపించడం జరిగింది.
– ఆయిల్ పామ్ పంటలను ప్రోత్సాహించేందుకు రూ.261.53 కోట్లు
– పంటల సాగు అనంతరం కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.337.41 కోట్లు
– సహకార బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించేందుకు రూ.4,404.71 కోట్లు కేటాయింపు
– ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 507.038 కోట్లు
– వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.102.227 కోట్లు
– వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.171.72 కోట్లు
– కొత్తగా ఏర్పాటైన ఫిషరీస్ యూనివర్సిటీకి రూ.38 కోట్లు
– మత్స్యకారులకు 23 వేల చేపల వేట బోట్లకు సబ్సిడీపై డీజిల్ పంపిణీ, బోటు మరమ్మతులకు, ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్, ఫిషింగ్ హార్బర్ లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు.
– మత్స్యశాఖకు రూ.521.34 కోట్లు ప్రతిపాదన
– రాష్ట్రంలో 6,987 ఫీడర్ల ద్వారా రైతులకు 9 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడి
– మొత్తంగా విద్యుత్ శాఖకు రూ.7,241.30 కోట్లు
– ఉపాధి హామీ పథకానికి రూ.5150 కోట్లు ప్రతిపాదన
– జాతీయ ప్రాజెక్టుగా పోలవరం గుర్తింపు, రూ.55,548 కోట్ల నిధుల మంజూరుకు కేంద్రం ఆమోదం
– కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం, ఎడమ కాలువ పనులకు రూ.4,202.69 కోట్లు మంజూరు
– అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలోని 3,99,997 ఎకరాలకు సాగునీరు, విశాఖపట్నం నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదన
– రూ.6,020.15 కోట్లతో గోదావరి – పెన్నా నదుల అనుసంధానం
– నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా 73 టీఎంసీల నీటిని పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సాగునీరు, 60.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు
– శ్రీకాకుళం జిల్లాలోని బొడ్డుపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ – 2 పనులకు మహర్దశ. 9 మండలాల్లో 225 గ్రామాలకు తాగునీరు, 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్ణయం
– వంశధార నీటిని 33.704 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించి, 19.05 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 2,059 కోట్లు వ్యయం
– హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాల్లో 6.025 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు
– రూ.13,635.63 కోట్ల నిధులతో 40 టీఎంసీల కృష్ణా నది నీటిని వినియోగించి, 33 లక్షల మందికి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక
అండగా నిలవాలి..
సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయడానికి పని చేస్తున్నాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలబడాలని కోరుతున్నా.
– కొణిదల పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
వ్యవసాయానికి ఊతం…
దేశానికి వెన్నెముక నిలిచే రైతన్న అండగా నిలిచేలా రాష్ట్ర బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరపడం ఆనందకరం. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.43,402 కేటాయించడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించడంతో పాటు రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం ఇచ్చేలా మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు నిధులు కేటాయించారు. ఇది పూర్తిగా రైతు సంక్షేమ బడ్జెట్.
– ఆర్.వీ.ఎస్.కే.కే రంగారావు (బేబినాయన), టీడీపీ ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గం
పోలవరానికి కట్టుబడి ఉన్నాం…
రాష్ట్రానికి జీవ నాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. దీనికి అనుగుణంగా రూ.55,548.58 కోట్ల నిధుల మంజూరుకు అమోదం తెలిపింది. రూ.1396.6 మీటర్ల పొడువునా డయా ఫ్రం వాల్ నిర్మాణానికి చురుగ్గా పనులు సాగుతున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిర్దేశిత గడువు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు ప్రజల దాహార్ని తీర్చుతాం.
– ఎన్.ఈశ్వరరావు, బీజేపీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల నియోజకవర్గం