Last Updated:

Tollywood: టాలీవుడ్ వైపు వైసీపీ చూపు..

టాలీవుడ్ నటులను సీఎం జగన్‌ వాడుకొని వదిలేశారా? 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీని పొమ్మనలేక పొగబొట్టారా? ఇన్నాళ్లూ ఏ పదవీ ఇవ్వని అలీ, పోసానికి ఎన్నికలకు ఏడాదికి పైగా ఉందనగా పదవులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? వైసీపీ వైపు చూడటానికి టాలీవుడ్‌ ప్రముఖులు ఇష్టపడటంలేదా?

Tollywood: టాలీవుడ్ వైపు వైసీపీ చూపు..

Tollywood: టాలీవుడ్ నటులను సీఎం జగన్‌ వాడుకొని వదిలేశారా? 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీని పొమ్మనలేక పొగబొట్టారా? ఇన్నాళ్లూ ఏ పదవీ ఇవ్వని అలీ, పోసానికి ఎన్నికలకు ఏడాదికి పైగా ఉందనగా పదవులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? వైసీపీ వైపు చూడటానికి టాలీవుడ్‌ ప్రముఖులు ఇష్టపడటంలేదా? అందుకే ఎన్నికల్లో టాలీవుడ్‌ సపోర్ట్‌ కోసం ప్లాన్ చేస్తున్నారా?

నటుడు అలీ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటా అవుననే అంటున్నారు ఆయన ఫ్యాన్స్‌. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసి, గెలుపులో కీలకపాత్ర పోషించిన అలీకి – కీలక పదవి ఇస్తారని అంతా ఆశించారు. కానీ సీఎం జగన్‌ ఆయనను ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వైజర్‌గా నియమించుకున్నారు. దీనిపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ అనుకుంటే చివరికి దక్కింది అంతేనా? అంటూ పెదవి విరుస్తున్నారు. అలీ అభిమానులు మాత్రం ఆయన సర్దుకు పోయి ఉంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి అలీ చేసిన కష్టానికి ఇది పెద్ద గుర్తింపు కాదని నిట్టూరుస్తున్నారు. ఆయనకు ఇంకేదైనా ఎమ్మెల్సీనో రాజ్యసభో లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అలీ కోరుకున్న దానికి లభించిన దానికీ ఎక్కడా పొంతన లేదనే అంటున్నారు. సలహాదారుల పదవి వల్ల అలీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. నెలకు గౌరవ వేతనం మూడు లక్షలు ఇతర అలవెన్సులు కలుపుకుని అయిదు లక్షల దాకా లభిస్తాయి అని చెబుతున్నారు. వైసీపీ విజయం కోసం విస్తృతంగా పర్యటిస్తే, ఇలాంటి పదవి ఇస్తారా అని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

పోసాని కృష్ణ మురళి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీకి అనుకూలంగా చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అసభ్య దూషణలు తీవ్ర కలకలం సృష్టించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పోసాని కృష్ణమురళికి పదవి వస్తుందని ఆశించగా ఎట్టకేలకు ఇప్పటికి ఆయనకు పదవి దక్కింది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏపీ ప్రభుత్వం అలీకి సలహాదారుగా పదవి ఇచ్చినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కంగ్రాట్యూలేట్ చేస్తూ కనీసం ట్వీట్ చేయలేదు. పోసానికి కూడా అంతే. అంటే వీరు చాలా చిన్న పదవుల కోసం ఎంత మందిని దూరం చేసుకున్నారో, ఎంత దారుణమైన రాజకీయాలు చేశారో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. అలా చేసి కూడా ఏ పదవులు పొందని వారు ఉన్నారు. పదవులు పొంది వైసీపీ మార్క్ రాజకీయాల్లో బలైపోయిన ఫృధ్వీ లాంటివాళ్లూ ఉన్నారు. అయితే దాదాపుగా నాలుగేళ్ల తర్వాత ఏడాదికిపైగా చాన్స్ ఉన్న పదవులు అలీ, పోసానికి ఇవ్వడం దేనికి సంకేతం? ఇంత కాలం గుర్తుకు రాని వారు ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చారు ? మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా లేకపోయినా మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగాల్సిఉంది. తెలంగాణతో పాటు కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవడం మంచిది కాదన్న వాదన ఉంది.

వైసీపీ వైపు చూడటానికి టాలీవుడ్ నటులు ఇష్టపడటం లేదని, వారిని జగన్ వాడుకుని వదిలేశాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో సినీ రంగానికి చెందిన అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి పోసాని కృష్ణమురళికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ బ్యాచ్ కావాలి. గతంలోలా ఊరూవాడా తిరిగి ప్రచారం చేయడానికి కావాలి. ఇప్పుడు వీళ్లకు పదవులు ఇవ్వడం వల్ల  కొంత మంది ఆశతో వైసీపీకి పని చేయడానికి వస్తారన్న ప్లాన్‌తోనే వీరికి పదవులు ప్రకటిస్తున్నారని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. గతంలో వైఎస్ఆర్‌సీపీ కోసం యాక్టివ్‌గా పని చేసి ఇప్పటికీ ఏ పదవి పొందలేకపోయిన వారిలో ఇంకా మోహన్ బాబు మిగిలే ఉన్నారు. కానీ ఆయన ఇటీవలి కాలంలో ఆ పార్టీలో ఉన్నారో లేరో అన్నట్లుగా ప్రకటనలు చేస్తూండటంతో ఏ పదవి ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. ఆయన కూడా ప్రస్తుత పరిస్థితిని చూసి వైసీపీకి దూరంగా ఉన్నారు. అయితే ఫేడవుట్ అయిన కొంత మందిని పార్టీలో చేర్పించుకుని యాక్టివ్ చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. వారెవరు అన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఎవరైనా పోసానిలా మాట్లాడి వ్యక్తిగత శత్రువుల్ని పెంచుకుంటారా అన్నది మాత్రం సందేహమే.

ఇవి కూడా చదవండి: