Last Updated:

TS Govt Serious: ఈటల రాజేందర్ పై అనర్హత వేటుకు రంగం సిద్దం

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయం మరింత రాజుకుంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, రాజాసింగ్ వ్యవహారాలు దుమ్మురేపితే, ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు.

TS Govt Serious: ఈటల రాజేందర్ పై అనర్హత వేటుకు రంగం సిద్దం

Hyderabad: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయం మరింత రాజుకుంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, రాజాసింగ్ వ్యవహారాలు దుమ్మురేపితే, ఇప్పుడు తాజాగా బీజేపీ నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. రెండు పార్టీల మధ్య రాజకీయాలను వేడెక్కించాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించినప్పటికీ, కేవలం రెండు రోజులకే పరిమితం చేయడం. తొలిరోజు 6 నిముషాలకే ముగించేయడం వంటివి రెండు పార్టీల మధ్య వాగ్యుద్దానికి దారితీశాయి.

ఈ క్రమంలోనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఈటల రాజేందర్ `మరమనిషి` అని వ్యాఖ్యానించడం దుమారానికి దారితీసింది. దీంతో అధికార పక్షం నుంచి ఏకంగా, రాజేందర్‌ పై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ తెర మీదికి వచ్చింది. ఈ పరిణామాన్నిసీరియస్‌గా తీసుకున్న బీజేపీ, ఎదురు దాడిని ముమ్మరం చేసింది. ఇదంతా వ్యూహాత్మకంగానే సాగుతున్న పరిణామంగా చెప్పుకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. సభాపతి బీఏసీ నిబంధనలు పాటించడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీని రానీయకుండా చేసేందుకు మంత్రులు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు త్వరగా ముగియటం పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఒక మరమనిషిలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది చేయటం తప్పించి, స్పీకర్ పోచారానికి వేరే పని లేదు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ మీటింగ్ కు పిలిచేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సభా సంప్రదాయాల్ని తుంగలోకి తొక్కుతోంది’ అంటూ మండిపడ్డారు. మరోవైపు, ఈటల రాజేందర్ పై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ఈటల నోటి నుంచి వచ్చిన మాటను ఆధారంగా చేసుకొని అసెంబ్లీ నుంచి ఆయన్ను ఎక్స్ పెల్ చేసే దిశగా సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టే ఆలోచనను చాలా సీరియస్ గా చేస్తున్నట్లు చెబుతున్నారు. స్పీకర్ ను ఉద్దేశించి ‘మరమనిషి’ అన్న విమర్శ పై తెలంగాణ సర్కారు సీరియస్‌గా ఉందట. కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

ఒకవేళ, నిజంగానే ఈటల పై అనర్హత వేటు వేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంటే, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కటం ఖాయమని చెప్పక తప్పదు. మొత్తం మీద ఈ పరిణామాలను గమనిస్తే, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య మరో రాజకీయ యుద్ధం ప్రారంభమైందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇవి కూడా చదవండి: