R Krishnaiah Demands 42 Percent Reservation Should Be Reserved For BC: వాటా ఇవ్వాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లో నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. ఈ సమావేశానికి 30 బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, 39 కుల సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.
42 శాతానికి పెంచాలి..
తెలంగాణలో రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచకపోతే ఊరుకోబోమని ఈ సందర్భంగా కృష్ణయ్య స్పష్టంచేశారు. ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చిందని, మరోవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఈ కులగణన చేసిన వెంటనే ఆ గణాంకాలను బయటపెట్టి, జనాభాలో బీసీల వాటా మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు ఖరారుచేయటంతో బాటు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. కులగణన చేసిన తరువాత రిజర్వేషన్లు పెంచితే న్యాయపరమైన చట్ట పరమైన అవరోధాలు ఉండవని ప్రభుత్వానికి సూచించారు.
సీలింగ్ పేరుతో పేచీ వద్దు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచాల్సిందేనని, తీరా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్ అని చెప్పి తప్పించుకోవటం ఈసారి కుదరదని స్పష్టం చేశారు. అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం పెట్టవచ్చని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నాయని తెలిపారు. జనాభాలో 10 శాతమే ఉన్న ఆర్థికంగా వెనకబడిన పేదల కోసం మూడు రోజులలో రాజ్యాంగ సవరణ చేసిన కేంద్రం 50 శాతం జనాభా గల బీసీల విషయంలో రాజ్యాంగ సవరణ చేయదా అని ప్రశ్నించారు.