New Year Offer in Hyderabad Free Transport services on December 31st: మద్యంబాబులకు అదిరిపోయే శుభవార్త. కొత్త సంవత్సరం పురస్కరించుకొని డిసెంబర్ 31న ఉచిత ప్రయాణంపై తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. ఇందు కోసం ప్రత్యేకంగా మూడు కమిషనరేట్ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అయితే, డిసెంబర్ 31వ తేదీన మద్యం తాగిన వ్యక్తులు వాహనాలు నడపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరం సందర్భంగా కొంతమంది మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉచిత ప్రయాణం అందించి దీని ద్వారా ప్రమాదాలను అరికట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్ వీలర్స్ సంఘం తెలిపింది.
మరోవైపు, మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది సందర్భంగా మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది డిసెంబర్ 31న అర్ధరాత్రి 1.15 నిమిషాల వరకు మెట్రో సేవలు అందించనుంది. హైదరాబాద్‌లోని అన్ని టెర్మినల్ స్టేషన్‌ల నుంచి అర్ధరాత్రి 12.30 నిమిషాల బయలుదేరనుంది. అయితే ఈ చివరి రైలు ఎండ్ పాయింట్‌కు దాదాపు 1.15 నిమిషాలకు చేరుకుంటుందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్.వీ.ఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సేవలు ఒక్కరోజు మాత్రమే ఉంటాయని, మిగతా రోజుల్లో యథావిధిగా ఉంటాయని వివరించారు.