Ajay Arasada: సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలి సంగీత దర్శకుడిగా.. అజయ్‌ అరసాడ మ్యూజికల్‌ జర్నీ

  • Written By:
  • Updated On - December 21, 2024 / 12:15 PM IST

ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా ఆయ్‌. బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజయ్‌ అరసాడ మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన వికటకవి వెబ్ సిరీస్ సంగీతం అందించారు. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ మిస్టరీ థ్రిల్లర్‌ ఇటీవల zee5లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ వెబ్‌ సిరీస్‌కు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. సంగీత దర్శకుడి వరుస హిట్స్‌ అందుకుంటున్న అజయ్‌ అరసాడతో స్పెషల్‌ చిట్‌ చాట్‌ సందర్భంగా ఓటీటీల నుంచి సినిమాల వరకు సాగిన తన మ్యూజికల్ జర్నీ గురించి ఆయన మాటల్లోనే చూద్దాం.

నేప‌థ్యం..?

వైజాగ్‌లో పుట్టి పెరిగాను. గీతం యూనివ‌ర్సిటీలో ఇంజ‌నీరింగ్ చ‌దువుకున్నాను. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా 2011 నుంచి 2018వ‌ర‌కు జాబ్ చేశాను. ఉద్యోగం మానేసిన సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ క్ర‌మంలో నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా మంచి స‌పోర్ట్ వ‌చ్చింది.

మ్యూజిక్ అంటే ఆస‌క్తి ఎందుకు?

మాది సంగీత నేపథ్యం కుటుంబం. చిన్నప్పుడు మా అక్కలు, అత్తలు వీణ వాయిస్తూ ఉంటే ఆసక్తిగా గమనించేవాడిని. అలా నాకు సంగీతం మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. ముందుగా గిటార్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఇంజనీరింగ్ కోసం గీతం యూనివర్శిటీలో చేరాను. చదువుతో పాటు మ్యూజిక్ పై కూడా దృష్టి పెట్టి గిటార్ నేర్చుకున్నా. క్లాసెస్ కు బంక్ కొట్టి మరి మ్యూజిక్ బ్యాండ్స్‌తో తిరిగేవాడిని. సంగీతంలో ఓనమాలు నేర్పింది నా కాలేజీ రోజులే. నాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన స్ఫూర్తితోనే సంగీత దర్శకుడిని కావాలని డిసైడ్ అయ్యాను.

సినీ రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు?

2011 నుంచి 2018 వ‌ర‌కు సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తూనే షార్ట్ ఫిల్మ్స్‌కు వ‌ర్క్ చేసేవాడిని. ఇలా చేయ‌టం వ‌ల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికిన‌ట్ల‌య్యింది. ఈ క్ర‌మంలో ప్ర‌దీప్ అద్వైత్ నన్ను జ‌గ‌న్నాట‌కం డైరెక్ట‌ర్ ప్ర‌దీప్‌కు ప‌రిచ‌యం చేశారు. నేను అంత‌కు ముందు చేసిన ఓ ముప్పై సెక‌న్ల మ్యూజిక్ బిట్ విని నాకు జ‌గ‌న్నాట‌కం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండ‌స్ట్రీలోకి నా తొలి అడుగు ప‌డింది. త‌ర్వాత ఇండిపెండెంట్‌గా వ‌ర్క్ చేసుకుంటూ వ‌స్తుండేవాడిని. ఆ స‌మ‌యంలో నా చిన్న‌నాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల న‌న్ను గూఢ‌చారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వ‌ర్క్ చేయ‌మ‌ని అడ‌గ‌టంతో వ‌ర్క్ చేశాను. ఆ త‌ర్వాత క్షీర సాగ‌ర మ‌థ‌నం, నేడే విడుద‌ల‌, మిస్సింగ్, శ్రీరంగ‌నీతులు సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. సినిమాల‌తో వెబ్ సిరీస్‌లైణ‌ సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్1, సీజ‌న్‌2ల‌కు సంగీతాన్ని అందించాను. రీసెంట్‌గా విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేశాను.

ఆయ్ సినిమాలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది?

నేను సంగీతాన్నందించిన మిస్సింగ్ మూవీలో ఓ బీజీఎం బిట్ విన్న నిర్మాత బ‌న్నీవాస్‌గారికి అది బాగా న‌చ్చింది. ఆయ‌న ఆ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. త‌ప్ప‌కుండా క‌లిసి ప‌ని చేద్దామ‌ని ఆ సంద‌ర్భంలో బ‌న్నీవాస్‌గారు చెప్పారు. అన్న‌ట్లుగానే ఆయ్ సినిమాకు వ‌ర్క్ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అయితే ముంద‌గా అమ్మ‌లాలో రామ్ భ‌జ‌న సాంగ్‌తో పాటు ఓ ఐటెమ్ సాంగ్‌కు సంగీతాన్ని ఇవ్వ‌మ‌ని బ‌న్నీవాస్‌గారు చెప్పారు. నేను కూడా ఆ రెండు పాట‌లు కంపోజ్ చేసిచ్చాను. వారికి అవి బాగా న‌చ్చేశాయి. దాంతో మిగిలిన పాట‌ల‌తో పాటు బీజీఎం వ‌ర్క్ కూడా చేయ‌మ‌ని అన్నారు. అలా ఆయ్ సినిమాకు వ‌ర్క్ చేశాను. ఆయ్ వంటి కామెడీ మూవీకి బీజీఎం చేయ‌టం మామూలు విష‌యం కాదు. అయితే సినిమా హిట్ అయిన‌ప్పుడు ప‌డ్డ క‌ష్ట‌మంతా మ‌ర‌చిపోయాను.

మీకు ఇన్‌స్పైరింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

దేవిశ్రీ ప్ర‌సాద్‌గారంటే నాకు చాలా ఇష్టం.

పీరియాడిక్ సిరీస్ విక‌ట‌క‌వి వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ?

డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలికి ఏం కావాల‌నే దానిపై ప‌క్కా క్లారిటీ ఉంది. అందువ‌ల్ల నేను విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌లేదు. డైరెక్ట‌ర్సే నాకు గురువులు. అందువ‌ల్ల డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలికి కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తూ వెళ్లానంతే. ఆయ్ సినిమాకు వ‌ర్క్ చేసేట‌ప్పుడే విక‌ట‌క‌వి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను. ఆయ్ రిలీజ్ త‌ర్వాత మ‌రో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. విక‌ట‌క‌వికి వ‌ర్క్ చేయ‌టం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్ట‌ర్స్ టెక్నిషియ‌న్.. వాళ్ల‌కి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వ‌ట‌మే నా ప్ర‌యారిటీ.. అది ఏ జోన‌ర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయ‌టానికి సిద్ధ‌మే.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?

ప్ర‌స్తుతం త్రీరోజెస్ సీజ‌న్ 2తో పాటు ఆహాలో మ‌రో రెండు వెబ్ సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాల‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను.