Last Updated:

CM Jagan: ముందుస్తు ఎన్నికల వైపు జగన్ చూపు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ఏపీ సీఎం జగన్‌ పక్కాగా వ్యూహరచన చేస్తున్నారట. అందుకోసం సరైన ముహూర్తాన్ని కూడా ఎంచుకుంటున్నారట. అన్ని విధాలుగా అనుకూలమైన డిసెంబర్ నెల బెటర్ అని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

CM Jagan: ముందుస్తు ఎన్నికల వైపు జగన్ చూపు

Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని ఏపీ సీఎం జగన్‌ పక్కాగా వ్యూహరచన చేస్తున్నారట. అందుకోసం సరైన ముహూర్తాన్ని కూడా ఎంచుకుంటున్నారట. అన్ని విధాలుగా అనుకూలమైన డిసెంబర్ నెల బెటర్ అని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే 2023 డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపించాలని జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారని విశ్వసనీయ సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. 2024 మేలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి తలపడాలి. అపుడు ప్రధాని నరేంద్రమోదీ వేవ్ గట్టిగా ఉంటే కనుక తమకు ఇబ్బంది అవుతుంది అని జగన్ లెక్కలు వేస్తున్నారట. ఇక ఏపీలో బీజేపీ జనసేనతో పొత్తులో ఉంది. ఎన్నికల వేళకు టీడీపీ కూడా వచ్చి చేరుతుంది అని వైసీపీ హై కమాండ్ లెక్కలేస్తోంది. దాంతో మోదీ, అమిత్ షా ఉధృతంగా ఏపీలో పర్యటిస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నలుచెరగులా తిరిగితే ఆ ప్రభావం ఎక్కువగానే ఉండవచ్చు అని కూడా సీఎం జగన్‌ అంచనా వేస్తున్నారట.

అలా కాకుండా 2023 డిసెంబర్‌లో జరిగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ కూడా ఎన్నికలకు వెళ్తే బోలెడు అడ్వాంటేజెస్ ఉన్నాయని జగన్‌ యోచిస్తున్నారని సమాచారం. తెలంగాణాలో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. దాంతో అత్యధిక సమయం బీజేపీ అక్కడే కేటాయిస్తుంది. అలాగే మోదీ కానీ, అమిత్ షా కానీ తమ వ్యూహాలన్నీ అక్కడే పెట్టి మోహరిస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా తెలంగాణా ఈసారి అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాంతో చంద్రబాబు అటూ ఇటూ చూడాల్సి ఉంటుంది. ఇలా ఫుల్ ఫోకస్ ఏపీ మీద నేతలు పెట్టలేరు అన్న చర్చ ఒకటి వైసీపీ వర్గాల్లో నడుస్తోందట. ఇంకో మాట ఏంటి అంటే ఒకసారి తెలంగాణా ఎన్నికలు పూర్తి అయితే టీయారెస్ తో సహా అందరూ కలసి ఏపీ మీదనే పడతారు. ఇక తెలంగాణా ఎన్నికలతో పొత్తుల లెక్కలు కూడా తేలుతాయి. తెలంగాణాలో టీడీపీ సపొర్ట్ ని బీజేపీ కచ్చితంగా తీసుకుంటుంది. దానికి పరిహారంగా ఏపీలో కూడా ఆ పార్టీ పనిచేస్తుంది పొత్తులు పెట్టుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.

అదే రెండు చోట్లా ఒకేసారి ఎన్నికలు జరిగితే మాత్రం పొత్తుల విషయం తేలినా కూడా ఫలితాలు మాత్రం పూర్తిగా ఎవరికీ అనుకూలంగా రావు అంటున్నారు. ఈ విధమైన కచ్చితమైన రాజకీయ విశ్లేషణలతోనే వైసీపీ ముందస్తు ఎన్నికలు అంటోంది అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకుని మరోసారి అధికారంలోకి వస్తే పార్లమెంట్ ఎన్నికల మీద కూడా ఆ ప్రభావం పడి వాటిని కూడా అత్యధిక శాతం గెలుచుకోవచ్చు. అపుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చు అని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా ఏపీ ఎన్నికల్లో బీజేపీ సామదాన భేద దండోపాయాలు ఈసారి ఉపయోగిస్తుంది అన్న చర్చ కూడా ఉంది. అందుకే ఒకేసారి అటూ ఇటూ ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి తెలంగాణా ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అన్ని శక్తులూ అక్కడే పెట్టి ఒడ్డుతుందని, దాంతో ఏపీలో వైసీపీకి పెద్దగా ఇబ్బందులు ఉండవని కూడా అంచనా కడుతున్నారు. ఈ మధ్యనే తెలంగాణా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలు లేవు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు పోదామని తమ పార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. దానిని ప్రాతిపదికగా తీసుకుని వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలకు వెడితే కొన్ని సీట్లు పోయినా మళ్లీ అధికారం చేతిలో పడుతుంది అన్న ఆలోచనలో వైసీపీ ఉంది అంటున్నారు.

ఇటు చూసుకుంటే తెలుగుదేశం పాదయాత్ర కానీ, పవన్ బస్సు యాత్ర కానీ ఇంకా మొదలు కాలేదు. అలాగే విపక్ష రాజకీయం కూడా ఇంకా అయోమయంలో ఉంది. ఎన్నికలు ముందుకు జరిపితే ఎంతలా సర్దుకున్నా పూర్తి స్థాయిలో అవగాహన కుదరదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. అది తమకు బాగా అడ్వాంటేజ్ గా ఉంటుందని కూడా అంచనావేస్తున్నారని తెలిసింది. మొత్తానికి వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఏపీకి ఎన్నికలు జరగవచ్చంటున్నారు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి: