Donald Trump Return to US from G7 Summit due to Iran- Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతోంది. ఇరుదేశాలు పరస్పరం భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని సర్వత్రా భయానక వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తక్షణమే టెహ్రాన్ ను ఖాళే చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ పూర్తిగా ధ్వంసం అవుతుందని హెచ్చరించారు.
తాజా పరిస్థితిపై డొనాల్డ్ ట్రంప్.. కెనడా వేదికగా జరగుతున్న జీ7 సమ్మిట్ నుంచి హుటాహుటిన అమెరికాకు బయల్దేరారు. దేశానికి వెళ్లగానే వైట్ హౌస్ లో భద్రతా మండలితో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు వైట్ హాస్ మీడియా సెక్రటరీ కరోలీన్ లీవిట్ వెల్లడించారు. కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఇరాన్ ఇప్పటికైనా అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని అధినేత ట్రంప్ సూచించారు. మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్ తో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని కోరారు. కాగా ఇవాళ తెల్లవారుజామున కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ వైమానిక విమానాలు విధ్వంసం సృష్టించాయి. అలాగే రాజధాని టెహ్రాన్ కు 320 కి.మీ. దూరంలో అణు స్థాపనకు అడ్డాగా ఉన్న నటాంజ్ లో కూడా క్షిపణి దాడులు జరిగినట్టు సమాచారం.