Turkey president Erdogan:సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని టర్కీ దళాలు నిర్వహించిన దాడుల్లో ఐఎస్ చీఫ్ హతమైనట్టు తాజాగా టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం వెల్లడించారు. తమ దేశానికి చెందిన ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్‌లో ఐసిస్ అనుమానిత నాయకుడు సిరియాలో హతమైనట్టు తుర్కియే అధ్యక్షుడు ఆదివారం టెలివిజన్‌లో మాట్లాడుతూ చెప్పారు.
అనుమానిత నేత డేష్ కోడ్‌నేమ్ అబు హుస్సేన్ అల్-ఖురాషి శనివారం సిరియాలో ఎంఐటీ నిర్వహించిన ఆపరేషన్‌లో హతమయ్యాడు అని పేర్కొన్నారు. గతేడాది నవంబరు 30న తమ చీఫ్ అబు హసన్ అల్ హసన్ అల్ హషిమీ అల్-ఖురాషీ హతమైనట్టు ఐఎస్ఐఎస్ ప్రకటించాడు. ఆయన స్థానంలో కొత్తగా అబు హుస్సేన్ అల్ ఖురాషిని ఐసిస్ చీఫ్‌గా నియమించారు.అఫ్రిన్ వాయువ్య ప్రాంతంలోని జిండిరెస్‌లో ఒక జోన్‌ను టర్కీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, స్థానిక మిలిటరీ పోలీసులు చుట్టుముట్టి.. ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తోన్న పొలాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర సిరియాలో 2020 నుంచి టర్కీ తన దళాలను మోహరించింది. సిరియా దళాల సహాయంతో మొత్తం జోన్‌లను నియంత్రిస్తుంది.
ఐరోపా, మధ్యప్రాచ్యంలో దాడులకు ఐఎస్ ప్రణాళికలు వేస్తోందని చెబుతూ ఉత్తర సిరియాలోని ఆ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఏప్రిల్‌లో హెలికాప్టర్ దాడి నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన అబ్ద్-అల్ హదీ మహ్మద్ అల్-హాజీ అలీని హతమార్చినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సిరియాలో ఏప్రిల్ 16న కనీసం 41 మంది అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను హతమార్చారు. ఏప్రిల్ మొదటి వారంలో అమెరికా దళాలు ఐరోపాలో దాడులకు ప్రణాళిక వేసిన ఐఎస్ఐఎస్ నేత ఖలీద్ అయద్ అహ్మద్ అల్-జబౌరీని హతమర్చారు.
ఇరాక్, సిరియా ప్రాంతాలను నియంత్రిస్తూ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు ఐరోపాలో వరుస దాడులకు ఐఎస్ బాధ్యత వహించింది. అక్టోబర్ 2019లో వాయువ్య సిరియాలో జరిగిన ఆపరేషన్‌లో ఐఎస్ అబూ బకర్ అల్-బాగ్దాదీని చంపినట్లు వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. ఒకప్పుడు నియంత్రించిన చాలా భూభాగం నుంచి తరిమివేసినా ఇప్పటికీ ఐసిస్ సిరియాలో దాడులను కొనసాగిస్తూనే ఉంది.