Northern Gaza: గాజా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సేనలు ఉత్తర గాజాను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ సైనికులు గాజా పౌరులను హెచ్చరించాయి. దీనితో వేలాది మంది పాలస్తీనా పౌరులు పిల్లాపాపాలను తీసుకుని చేతిలో తెల్ల జెండాలను పట్టుకొని దక్షిణాది ప్రాంతాలకు గుంపులు గుంపులుగా తరలివెళుతున్నారు.
నాలుగు గంటల్లో ఖాళీ చేయాలి..(Northern Gaza)
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సేనలు ఉత్తర గాజాకు చెందిన ప్రజలకు నాలుగు గంటల సమయం ఇచ్చి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర గాజాను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. వెంటనే ఖాళీ చేయకపోతే శిథిలాల మధ్య చిక్కుబడిపోతారని హెచ్చరించారు. నాలుగు గంటల తర్వాత భారీ ఎత్తున ఈ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తామని సైనికులు గాజా పౌరులను ముందుస్తు హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం గాజాలో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.చేతులు పైకి ఎత్తి నడుకుకుంటూ వెళుతున్నామని.. చాలా మంది చేతల్లో తెల్లజెండాలు పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లామని గాజా వాసులు చెప్పారు. అయితే మిలిటరీ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇక ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ సైనికులు గాజాలోని ఇంటింటికి వెళ్లి హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టాలని చూస్తోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత నెల 7వ తేదీ నుంచి మొదలైన యుద్ధంలో గాజాలో భూతలదాడికి ఇజ్రాయెల్ సైనికులు సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
బలవంతంగా వెళ్లగొడుతున్నారు..
హమాస్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెప్యూజీలపై మండిపడుతోంది. ఈ సంస్థ ఇజ్రాయెల్‌తో కుమ్మక్కై గాజా పౌరులను బలవంతంగా తమ ఇళ్ల నుంచి బెదిరించి వెళ్లగొడుతోందని మండిపడింది. గాజా నగరంతో పాటు నగరంలోని ఉత్తర ప్రాంతంలో జరిగే ప్రాణ నష్టానికి యూఎన్ బాధ్యత వహించాల్సిందేనని హమాస్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం గాజా నగరంలోని ఉత్తర ప్రాంతం నుంచి తమ పౌరులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని హమాస్ మీడియా బ్యూరో చీఫ్ సలామా మారుఫ్ చెప్పారు. దీనికి యునైటెడ్ నేషన్స్ రిలిఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీనే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కాగా దీనిపై యూఎన్‌ఆర్‌డబ్ల్యుఏ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు.
ఇక యూఎన్ అంచనా ప్రకారం గాజాలో సుమారు 25 లక్షల జనాభా ఉంటే 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా ఇజ్రాయెల్ మిలిటరీ గగనతలం నుంచి భూతలం నుంచి పెద్ద ఎత్తున దాడులు చేయడంతో గాజా నగరానికి చెందిన పౌరులు ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు కట్టుబట్టలతో అందిని కాడికి సామానును తీసుకుని బయలు దేరారని యూఎన్ పరిశీలకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడులతో నేల మట్టం అయిన ప్రాంతాల నుంచి ప్రజలు తెల్లజెండాలు చేతబట్టి గుంపులు గుంపులుగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బాంబులతో మృతుల సంఖ్య పెరిగిపోవడంతో పాటు రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. వాహనాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. గాడిదలతో పాటు బుల్‌డోజర్లను కూడా రవాణా సాధానాలుగా వినియోగించుకుంటున్నారు.
గాజాలో సుమారు 23 లక్షల మంది నివాసాలను కోల్పోయారు. స్కూళ్లు, ఆస్పత్రులు కూడా బాంబుదాడి ధాటికి కుప్పకూలాయి. మంగళవారం నాడు కూడా సుమారు 15 వేల మంది ఉత్తర గాజా నుంచి తరలిపోయారు. అంతకు ముందు సోమవారం నాడు 5వేల మంది, ఆదివారం నాడు రెండు వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారని యూఎన్ అధికారులు చెప్పారు. ఉత్తర గాజాలో మొత్తం 13 ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. వెంటనే రోగులను ఆస్పత్రి నుంచి తరలించాలని ఇజ్రాయెల్ మిలిటరీ ఆదేశాలు జారీ చేసింది.