Site icon Prime9

Pakistan: పాకిస్తాన్‌లో చుక్కలనంటుతున్న నిత్యావసరాలు.. లీటర్ పాలు రూ.210.. కిలో చికెన్ రూ.850

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లో నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటి ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. ఈ రోజు ఉన్న రేట్లు రేపు ఉండటం లేదు. రోజు వాడే పాల ధరనే తీసుకుంటే గత వారం లీటరు 190 రూపాయలున్న పాలు ప్రస్తుతం 210 పలుకుతోంది. గత రెండు రోజుల నుంచి చూస్తే లైవ్‌ బ్రాయిలర్‌ చికెన్‌ కిలోకు 30-40 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో 480 నుంచి 500 రూపాయలకు చేరింది. ఈ నెల ప్రారంభంలో లైవ్‌ బర్డ్‌ కిలో 390 నుంచి 440కు విక్రయించే వారు. ఇదే ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో కిలో 380 నుంచి 420 మధ్య విక్రయించే వారు. కరాచీలో కోడి మాంసం ప్రస్తుతం కిలో 700 నుంచి 780 మధ్యన విక్రయిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఇదే కోడి మాంసం 620 నుంచి 650 మధ్య విక్రయించే వారు.

చుక్కలనంటుతున్న పాలు, చికెన్ ధరలు..(Pakistan)

బోన్‌లెస్‌ మాంసం అయితే కిలో 1,000 నుంచి 1,100 పలుకుతోంది. కొన్ని రోజుల స్వల్ప వ్యవధిలోనే కిలోకు 150 నుంచి 200 వరకు పెరిగింది. అలాగే బోన్‌తో ఉన్న చికెన్‌ అయితే కిలో 800 నుంచి 850 మధ్యలో విక్రయిస్తున్నారు. ఇక పాల విషయానికి వస్తే లీటరు 190 నుంచి 210 మధ్యలో విక్రయిస్తున్నారు కాగా కరాచీ మిల్క్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ మీడియా కో ఆర్డినేటర్‌ వాహీద్‌ గద్దీ తాజా ధరల గురించి ప్రస్తావిస్తూ.. సుమారు 1,000 దుకాణదారులు అధిక ధరకు పాలు విక్రయిస్తున్నారన్నారు. వీరంతా పాల దుకాణదారులు, హోల్‌సెల్లర్స్‌ అని వీరు తమ సభ్యలు కాదన్నారు. తమ అసోసియేషన్‌కు చెందిన 4,000 రిటైల్‌ సభ్యులు మాత్రం లీటరు 190కి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

పాడి రైతులు కానీ, టోకు దుకాణదారులు ధరలు సవరించకపోతే ప్రస్తుతం రిటైల్‌ పాల ధర లీటరు 210 నుంచి 220కి చేరేదన్నారు. కాగా పాలసేకరణ ధర లీటరుకు 27 రూపాయలు పెరిగిందని వాహీద్‌ అన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 16న రిటైలర్స్‌ పాల ధరను లీటరుకు 10 రూపాయలు పెంచారు. దీంతో కరాచీలో పాలు లీటరు 180కి ఎగబాకింది. అయినా మెజారిటి రిటైలర్స్‌ లీటరు 190కే విక్రయిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించి ధరను మాత్రం ఏ పాల విక్రయదారుడు అమలు చేయడం లేదు. కాగా ప్రభుత్వం అధికారికంగా హోల్‌సేల్‌ ధర లీటరుకు 160 నుంచి 170కి సవరించింది.

కోళ్లదాణా కొరతవల్లే చికెన్ ధరలు పెరుగుతున్నాయి..(Pakistan)

ఇక పెరిగిపోతున్న చికెన్‌ ధరలు గురించి సింధ్‌ పౌల్ట్రీ అసోసియేష్‌ జనరల్‌ సెక్రటరీ కమల్‌ అఖ్తర్‌ సిద్దికి మాట్లాడుతూ.. లైవ్‌ బర్డ్‌ కిలో 600కు విక్రయిస్తున్నారని అన్నారు. రిటైలర్స్‌ మాత్రం తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటూ పోతున్నారని ఆయన అన్నారు. అయితే కోళ్ల దాణా అందుబాటులో లేకపోవడం వల్లే ధరలు పెరిగాయని అఖ్తర్‌ సిద్దిఖి పేర్కొన్నారు. పౌల్ర్టీ ఫీడ్‌ విషయానికి వస్తే కీలకమైన దాణా సోయా బీన్‌ మీల్‌ అత్యంత కీలకం. కాగా దిగుమతి చేసుకున్న సోయాబిన్‌ ప్రస్తుతం ఓడరేవుల్లో నిలిచిపోయిందని వివరించారు. 50 కిలోల పౌల్ట్రీ ఫీడ్‌ ప్రస్తుతం 7,200 పలుకుతోందని, గత నెలతో పోల్చుకుంటే బస్తాకు 600 రూపాయలు పెరిగిందని చెప్పారు. కోళ్లకు సోయాబిన్‌ ఇవ్వకపోయినా ధరలు మాత్రం అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉన్నాయన్నారు అఖ్తర్‌.

సోయాబీన్ దిగుమతులకు  అనుమతించని  ప్రభుత్వం..

రాబోయే రోజుల్లో చికెన్‌ ధరల్లో ఒడిదుడకులుంటాయన్నారు అఖ్తర్‌. విదేశాల నుంచి సోయాబిన్‌ దిగుమతులకు ప్రభుత్వం అనుమతించడం లేదు. ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు దాదాపు అడుగంటి పోయిన నేపథ్యంలో సోయాబిన్‌ దిగుమతికి ప్రభుత్వం అంగీకరించలేదని అఖ్తర్‌ వివరించారు. డాలర్‌ మారకంతో రూపాయి భారీగా పతనం కావడంతో విదేశీ సరఫరా దారులు స్థానిక వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వెనుకాడుతున్నారు. దేశంలోని అన్ని ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తయారీదారులు, వ్యాపారులుతమ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వం మాత్రం ధరల అదుపునకు గట్టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Exit mobile version