Breaking News

కిమ్ సోదరి బెదిరింపులకు దిగి వచ్చిన దక్షిణ కొరియా..!

05 th Jun 2020, UTC
కిమ్ సోదరి బెదిరింపులకు దిగి వచ్చిన దక్షిణ కొరియా..!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ బెదిరింపులకు దాయాది దేశం దక్షిణ కొరియా దిగొచ్చింది. ఆమె హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర కొరియా తీరును నిరసించిన కార్తకర్తలపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు డెయిలీ మెయిల్‌ కథనం ప్రచురించింది.
దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, దాయాది దేశం నుంచి వలస వచ్చిన వారు.. కిమ్‌ నియంతృత్వ పోకడలు, అణ్వాయుధాలపై ఉత్తర కొరియా విధానాలను విమర్శిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. వాటితో పాటు కిమ్‌ను దుయ్యబడుతూ రాయించిన కరపత్రాలను గాల్లోకి విసిరారు. ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ ... మాతృదేశానికి ద్రోహం చేసిన ఫిరాయింపుదార్లంతా సంకరజాతి కుక్కలు. వారి ప్రేలాపనలకు యజమానులు సమాధానం చెప్సాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ అధికార మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అదే విధంగా కిమ్‌ను విమర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనట్లయితే.. ఇరు దేశాల మధ్య కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని దాయాది దేశాన్ని హెచ్చరించారు. అంతేగాకుండా ఉభయ కొరియాల పునర్‌ కలయికకు నిదర్శనంగా నిలిచిన అనుసంధాన వేదికలన్నింటినీ మూసివేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ కొరియా అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించినట్లు డెయిలీ మెయిల్‌ పేర్కొంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox