India- Canada Visa: కెనడా పౌరులకు భారత్ ఈ-వీసా సేవలను పునరుద్ధరించిందని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్ల పేరును ముడిపెట్టారని పీఎం జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్‌లోకెనడియన్ పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది.
ట్రూడో వ్యాఖ్యలతో ..(India- Canada Visa)
అంతేకాదు కెనడా ఆరోపణలను నిరాధారమైనవని పేర్కొంది. తదనంతరం, రెండు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించి, వీలైనంత త్వరగా ఆ స్థలం నుండి వెళ్లిపోవాలని కోరాయి.నాటినుంచి భారత్, కెనడా ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఇండియాలో కెనడా రాయబారుల సంఖ్య 62 ఉంది. అయితే ఇండియా ప్రభుత్వం ఏకంగా 40 మందిని తగ్గించాలని ఆదేశించింది. కెనడాలో పార్లమెంటులో జరిగిన డిబెట్‌లో ట్రూడో ప్రసంగిస్తూ.. కెనడా జాతీయ భద్రతా అధికారులు నిజ్జర్ హత్య కేసులో ఇండియాప్రభుత్వానికి చెందిన ఏజంట్ల హస్తం ఉందని బలంగా నమ్ముతున్నారని చెప్పారు. కాగా సర్రేలోని గురునానక్ సిఖ్ గురుద్వారాకు నిజ్జర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ట్రూడో ఆరోపణలను ఇండియా నిర్ద్వంద్వంగా ఖండించింది. ఉద్దేశం పూర్వకంగా బురదచల్లుతోందని ఆరోపించింది. కెనడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపించలేదని భారత ప్రభుత్వం చెబుతోంది.
ఇటీవల భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుంచి తమకు కెనడా మధ్య ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తాయని అన్నారు. కెనడా ప్రభుత్వం టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని హింసను ప్రేరేపిస్తోందన్నారు జై శంకర్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దిగజారిపోయాయని అన్నారు. కెనడా ప్రభుత్వం నిజ్జర్ హత్యకు సంబంధించి ఆధారాలు చూపిస్తే దానికి తగ్గ గట్టి చర్యలు తీసుకుంటామని జై శంకర్ హామీ ఇచ్చారు.