Breaking News

భారత్‌లో పదిరోజుల్లోనే లక్షకు పైగా కరోనా కేసులు..!

13 th Jun 2020, UTC
భారత్‌లో పదిరోజుల్లోనే లక్షకు పైగా కరోనా కేసులు..!

భారత్‌లో శనివారం ఉదయం నాటికి  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షల మైలురాయిని దాటింది.. ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,08,993కి చేరగా, మృత్యుల సంఖ్య 8884కి పెరిగింది. 1,54,330 మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నారు.

జనవరి 30న భారత్‌ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగా, మే 18 నాటికి లక్ష మార్క్‌ చేరుకుంది. అంటే 109 రోజుల సమయం పట్టింది. తర్వాత రెండు వారాలకే కోవిడ్‌ కేసులు 2 లక్షలు దాటేశాయి. అక్కడి నుంచి 3 లక్షల మార్క్‌ను చేరడానికి  కేవలం 10 రోజులు మాత్రమే పట్టిందంటే కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ సడలించినప్పటి నుంచి రోజుకు 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. . మార్చి 25 నుంచి దాదాపు రెండు నెలలు పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఆ సమయంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో ఇప్పుడు కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాలని నిపుణులు కోరుతున్నారు.


అత్యధికంగా కోవిడ్‌-19 బారిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో 3 లక్షల కరోనా కేసులు నమోదు కావడానికి కేవలం 73 రోజులే పట్టింది. బ్రెజిల్‌ 85, రష్యా 109 రోజుల్లో 3 లక్షల మైలురాయిని దాటాయి. అయితే ఈ మూడు దేశాల మొత్తం జనాభా.. భారతదేశ జనాభాలో దాదాపు సగమే మాత్రమే. భారత్‌తో పోల్చుకుంటే అమెరికా, బ్రెజిల్, రష్యాలు అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయన్న విషయం గమనించాలి.

టాప్‌-10 కరోనా బాధిత దేశాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు జరుగుతున్న కోవిడ్‌ పరీక్షలను పరిశీలిస్తే భారత్‌ చాలా వెనుకబడి ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. . ప్రస్తుతం దేశంలో రోజుకు 1.5 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరు వారాల క్రితం వరకు కేవలం 10 నుంచి 20 వేల వరకు మాత్రమే కోవిడ్‌ టెస్ట్‌లు చేశారు.



. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి వారం క్రితం 15.4 రోజులు కాగా, ప్రస్తుతం అది 17.4 రోజులుగా నమోదయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలియజేసింది. తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించిన (మార్చి 25న) సమయంలో కరోనా కేసులు కేవలం 3.4 రోజుల్లో రెండింతలు అయ్యాయని గుర్తుచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 53,63,445 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox