కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. మరో వైపు బ్రెజిల్ లోను కేసులు విపరీతం గా పెరుగుతున్నాయి. నిమిషానికో మరణం సంభవిస్తుంటే.. అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.. ఆరు లక్షల మందికి పైగా మహమ్మారి సోకగా.. దాదాపు 35 వేల మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలా ఉంటె.. అక్కడి అధ్యక్షుడు జేర్ బోల్సోనారో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకోవడం తో పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. "ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ఆరోగ్య సమస్యల కంటే ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయంటూ " ఇటీవల ఆయన వ్యాఖ్యలు చేయడం తో ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు స్థానిక మీడియా కూడా బొల్సోనారో ను విమర్శిస్తోంది. "నిమిషానికో బ్రెజిలియన్‌ను బలితీసుకుంటున్న కరోనా సాధారణ ఫ్లూ వంటిదేనన్న వ్యాఖ్యలు చేసి మూడు నెలలు దాటిపోయింది" అంటూ అధ్యక్షుడిని విమర్శించింది. " వార్తను చదువుతున్న సమయంలోనే కోవిడ్‌తో మరో బ్రెజిల్ పౌరుడి ప్రాణం పోయినా ఎవరికీ పట్టదు "అంటూ ఫోహా డీ ఎస్. పౌలో తన ఎడిటోరియల్‌లో ఓ భావోద్వేగ కధనాన్ని ప్రచురించింది.
మరోవైపు.. అన్ని దేశాలు తమ ఆంక్షలను సడలించడం తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. కరోనా ముప్పు తప్పలేదని.. అప్రమత్తం గా ఉండకపోతే.. మరింత ఇబ్బంది తప్పదని హెచ్చరిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటె.. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకుంటామని బెదిరింపు వ్యాఖ్యలకు దిగారు. గతం లో కూడా చైనా కు వంత పాడుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలకు బొల్సోనారో మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.