Breaking News

ఈ దుస్తులు అరగంటలో కరోనా ను ఖతం చేస్తాయి..!

12 th Jun 2020, UTC
ఈ దుస్తులు అరగంటలో కరోనా ను ఖతం చేస్తాయి..!

ఒకవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్ల తయారీలో అనేక దిగ్గజ  ఫార్మా కంపెనీలు నిమగ్నమై వున్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకునే విభిన్నమైన విప్లవాత్మక ఉత్పత్తులు, సాధనాల రూపకల్పనలో దిగ్గజ సంస్థలనుంచి స్టార్టప్ కంపెనీల దాకా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా బిజినెస్ ను కొత్త పుంతలు తొక్కించిందని కూడ చెప్పవచ్చు.

తాజాగా వైరస్ ను మట్టుబెట్టే యాంటీ వైరల్ దుస్తులు, వస్త్ర బ్రాండ్లు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ దుస్తులు అరగంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుందని చెప్పడం విశేషంగా మారింది. ముంబైకి చెందిన ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ డోనియర్ ఇండస్ట్రీస్ ఈ రకమైన బ్రాండ్లను  పరిచయం చేసింది. స్విట్జర్లాండ్‌ టెక్స్‌టైల్‌ సంస్థ హీక్యూ సహకారంతో, నియో టెక్ బ్రాండ్ క్రింద యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ విడుదల చేసింది.  కేవలం 30 నిమిషాల్లో కోవిడ్-19 వైరస్ ను చంపేస్తుందని చెబుతోంది.  

హీక్యూ వైరోబ్లాక్ ఎన్‌పిజె03 టెక్నాలజీ ద్వారా కోవిడ్-19కు చెక్ పెట్టవచ్చని డోనియర్ ఇండస్ట్రీస్ సీఎండీ రాజేంద్ర అగర్వాల్ చెప్పారు. . ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని పీటర్ డోహెర్టీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ  ఈ పరీక్షలు నిర్వహించిందనీ, ఇవి వైరస్ ను 99.99 శాతం నిరోధించినట్టుగా నిర్ధారించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కరోనా లాంటి ప్రాణాంతాక వైరస్ నివారణ దుస్తులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెరికాలోని మెడికల్ టెక్స్‌టైల్ కంపెనీకి ఎగుమతి చేస్తున్నామనీ, భారతదేశంలోని అనేక రాష్ట్ర పోలీసు విభాగాలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణలో ఈ దుస్తుల సమర్థత నిర్ధారణ అయిన తరువాత భారత మార్కెట్ కోసం తమ ఉత్పత్తిని మరింత పెంచామని అగర్వాల్ చెప్పారు.

ప్రాథమికంగా యాంటీ-వైరల్ దుస్తుల కేటగిరీలో పాలిస్టర్-విస్కోస్ సూటింగ్, వూలుతో చేసిన సూటింగ్స్ అందుబాటులో ఉంచినట్టు అగర్వాల్ తెలిపారు.   ఇది కేవలం పై పూత కాదుకాదు కనుక ఎక్కువసేపు ఉంటుందని  అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు. నిర్దిష్ట రసాయనాన్ని ఫాబ్రిక్ నిర్మాణంలోనే పొందుపరచినందువల్ల తరచూ ఉపయోగించినా, ఉతికినా కూడా దీని ప్రభావం పోదని స్పష్టం చేశారు. అయితే ఈ యాంటీ-వైరల్ బట్టల ధరలు 20 శాతం ఎక్కువ.  కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  ధర ఎక్కువైనా  ఈ తరహా దుస్తుల అమ్మకాలకు ఢోకా వుండదని చెప్పవచ్చు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox