కరోనా లాక్ డౌన్ కారణం గా దాదాపు రెండున్నర నెలలపాటు షూటింగ్ బంద్ అయిన సంగతి తెలిసిందే . అయితే.. జూన్ ఎనిమిది నుంచి దేవాలయాలకు.. ప్రార్ధనామందిరాలకు అనుమతులు ఇస్తున్న నేపధ్యం లో తెలంగాణ లో షూటింగ్ లకు కూడా అనుమతులు ఇస్తున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. అయితే..కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ.. సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవచ్చని సీఎం కెసిఆర్ అనుమతులు ఇచ్చారు.
అలానే.. షూటింగ్ పనులు పూర్తి అయిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చేసుకోవచ్చని సీఎం కెసిఆర్ అనుమతించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. థియేటర్లకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.
ఇటీవల... సినీ పరిశ్రమ కు చెందిన పలువురు ప్రముఖులు మంత్రి తలసాని శ్రీనివాస రావు తో చర్చించి ఆపై ముఖ్యమంత్రి కెసిఆర్ ను కూడా కలిసి సమస్య గురించి వివరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భం గా వారు సినిమా, టివి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్ల తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలం గా స్పందించి విధి విధానాలను రూపొందించాల్సింది గా ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు.
ఈ మేరకు ప్రభుత్వం విధించిన విధి విధానాలను అనుసరిస్తూ..పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనితో.. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా షూటింగ్ లకు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చేసారు. థియేటర్ల విషయం మాత్రం.. కేంద్రం పరిధి లో ఉన్నందున అనుమతులు ఇవ్వలేమని తెలిపారు.