న్యూఢిల్లీ :జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లపై విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారంనాడు విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 1 నుంచి 6 వరకూ జేఈఈ మెయిన్, సెప్టెంబర్ 13న నీట్ (యూజీ) నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దీనిపై రాహుల్ ఓ ట్వీట్లో స్పందించారు. 'ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఏదో చెప్పదలచుకున్నారు. నీట్, జేఈఈ పరీక్షల విషయంలోవిద్యార్థుల మనసులో మాట ను భారత ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలి' అని ఆయన అన్నారు.
కోవిడ్-19 కేసుల నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో రాహుల్ తాజా ట్వీట్ చేశారు. జేఈఈ, నీట్ రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా కూడా కోరారు.