Mangala Gauri Vratham: శ్రావణ మాసం అనగానే మహిళలు ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ప్రసిద్ధి. ఈ మాసంలో చేసే వ్రతాలు, పూజలకు ఎంతో ప్రత్యేకత వుంది. శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తుకొచ్ఛేది.. “వరలక్ష్మీ వ్రతం”. ఇది కాకుండా ఈ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. దీనిని “శ్రావణ మంగళవార వ్రతం” అని, ”మంగళ గౌరీ నోము” అని కూడా అంటారు. మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వలన మహిళలు తమ “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అందుకనే శ్రావణమాసమంలో మంగళవారములు వస్తాయో అన్ని మంగళవారాలు వ్రతం ఆచరిస్తూ మంగళగౌరిని పూజిస్తారు.
శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేసేందుకు ఉదయమే స్నానం ముగించుకుని మహిళలు వ్రత సంకల్పం చేస్తారు. ఆ తరువాత శుభ్రమైన ప్రదేశంలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి, అలంకరిస్తారు. దీనిపై పార్వతీ దేవి విగ్రహం లేదా ఫోటో ప్రతిష్టిస్తారు. ఆ తరువాత కుంకుమ, గంధం, బియ్యం, ఎర్రపూలు, ధూపం, దీపం, నైవేద్యం వంటివి పార్వతీ దేవికి సమర్పిస్తారు. దాంతోపాటు పార్వతీ దేవికి శృంగార వస్తువులు సమర్పిస్తారు. ఆ తరువాత పార్వతీ దేవికి హారతి ఇచ్చే కార్యక్రమముంటుంది. మొత్తం రోజంతా వ్రతముండి, ఉపవాసముంటారు. సాయంత్రం వేళ వ్రతాన్ని విడుస్తారు. పెళ్లి కావల్సిన అమ్మాయిలు వ్రతం చేస్తే మంచి వరుడు లభిస్తాడని నమ్మకం. అటు పెళ్లైన అమ్మాయిలు ఈ మంగళ గౌరీవ్రతం ఉండటం వల్ల సౌభాగ్యం, సుఖమైన దాంపత్య జీవితం, కుటుంబ సంతోషం లభిస్తాయి.
ఈ మంగళ గౌరీ వ్రతాన్ని పెళ్లి అయిన స్త్రీలు ఐదు సంవత్సరాలు చేస్తారు. వివాహం ఐన మొదటి సంవత్సరము పుట్టింట్లోను, మిగిలిన నాలుగేళ్లు అత్తారింటిలోను ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణ మంగళవార వ్రతాచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ. పండు, తాంబూలం తో వాయనాలివ్వాలి.
ఇలా మంగళ గౌరీ వ్రతం మొదలు పెట్టిన తర్వాత అయిదేళ్లు అయ్యాక, ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి, మట్టెలు, మంగళసూత్రాలు గాజులు, పసుపు, కుంకుమ, తదితర మంగళకరమైన వస్తువులను పెట్టి,పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి.