Vontimitta Ramalayam Tepmle: ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాలో ఈ దేవాలయం ఉంది. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఊరు ఉంది. ఈ దేవాలయం ఏకశిలానగరమని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతి ఏటా రాములు కల్యాణం బాగా జరిపిస్తారు.
ఒంటిమిట్ట దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉంటాయి. చుట్టూ విశాలమైన ఆవరణ ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించారు. ఇక్కడ రామాలయంలో గోపురాలన్ని చోళ పద్ధతిలో రంగమంటపం నిర్మించబడ్డాయి. ఇక్కడ రామాలయంలో ఉన్న శిల్పాలన్ని విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. రాములు వారికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని కూడా నిర్మించాడు. ఇతను టెంకాయ చిప్ప పట్టుకుని భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో ఆభరణాలను చేయించాడు. అప్పటిలోనే సుమారు పది లక్షల రూపాయల డబ్బును పోగు చేసి విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేరును నామకరణం చేసాడు. ఒంటిమిట్ట రామాలయం గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల, రథం ఉంటాయి.
ప్రతి ఏడాది పూజలు, ఉత్సవాలు బాగా జరిపిస్తుంటారు. చైత్ర శుద్ధ నవమి నుండి మొదలు అయి బహుళ విదియ దాకా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం జరిపిస్తారు. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. ఆ రోజు అక్కడ కవి పండితులను సత్కరిస్తారు.