Spiritual: త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువుకు ఆయనభార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. ఈ మాసంలో వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు నశిస్తాయి.
శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.శ్రావణమాసంలో శ్రావణపౌర్ఱమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ , వేదభ్యాసాన్ని ప్రారంభిస్తారు.
పైన చెప్పినవేకాకుండా కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన కూడ ఈ మాసంలోనే వస్తాయి. నియమాలమేరకు వీటిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చని పెద్దలు తెలిపారు.