Site icon Prime9

Raksha Bandhan 2022: శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పండుగ ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Shravana Purnima And Raksha Bandhan: హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ రోజే జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. అదే విధంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఈ ఏడాది ఆగస్టు 11న రాఖీ పండుగను జరుపుకోనున్నారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు .

రక్షాబంధన్ కు పురానత కాలంనుంచి ప్రాచుర్యం ఉంది. ద్రౌపది, శ్రీకృష్ణుడి అన్నాచెల్లెల అనుబంధం అందరికీ తెలిసిందే. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. అప్పటినుండి సోదరి సోదరుని చేతికి రక్షా కట్టటం ఆనవాయితీ అయింది అని అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొని వెడుతుంది. అంతటి శక్తివంతమైనది కాబట్టే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రపంచాన్ని జయించాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో నేటి ఆఫ్ఘనిస్తాన్ అయిన బాక్ట్రియాకు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలనేది అలెగ్జాండర్‌ ఆలోచన. అలా అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. అతనితో పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా కూడా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు. సోదరి కట్టిన రక్షకి విలువిచ్చి ఆమె సౌభాగ్యన్ని ప్రసాదించేంత ప్రాముఖ్యత కలిగింది రాఖీ, కాబట్టి పురాణకాలం నుండి రాఖీ ఆచారం ప్రాచుర్యంలో ఉంది.

మరోవైపు శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోప‌వీతం పేరుతో పిలుస్తారు. దీనికి అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. అందుకే శ్రావణపౌర్ణిమను జంధ్యాల పౌర్ణమి అని కూడ అంటారు. ఉపనయనం జరిగిన తరువాత జంధ్యాన్ని ధరించడం అనేది ఆచారం. యఙ్ఞోప‌వీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. జంధ్యాన్ని ధరించిన వ్యక్తి త్రికాల సంధ్యావందనం, గాయత్రీ పూజ మరియు ఇతర పూజలు చేయడానికి అర్హుడు. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు

Exit mobile version