Lord Hanuman: ఆంజనేయస్వామిని తమలపాకులతో ఎందుకు పూజిస్తారంటే..

కష్టాలు, నష్టాలు, భూత, ప్రేత, పిశాచ భయాలు ఏమైనా సరే హనుమంతుడి శరణు వేడతే చాలు పారిపోతాయనేది భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి దేవాలయాలు లేని గ్రామాలు దాదాపు ఉండకపోవచ్చు. ఈ స్వామిని తమలపాకులు, వడమాల, సింధూరంతో అర్చిస్తారు.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 04:18 PM IST

Spiritual: కష్టాలు, నష్టాలు, భూత, ప్రేత, పిశాచ భయాలు ఏమైనా సరే హనుమంతుడి శరణు వేడతే చాలు పారిపోతాయనేది భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి దేవాలయాలు లేని గ్రామాలు దాదాపు ఉండకపోవచ్చు. ఈ స్వామిని తమలపాకులు, వడమాల, సింధూరంతో అర్చిస్తారు. వీటిలో తమలపాకుల మాలతో అర్చన ఎందుకు అనే విశేషాలు తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించిన సమయంలో రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతున్న హ‌నుమంతుడు అశోకవనం చేరుకున్నాడు.

అక్కడే సీతమ్మ ఉన్న విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలదేరుతాడు. అయితే అదే సమయంలో సీతమ్మ ఆంజనేయుడిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది. కానీ, అక్కడ చుట్టుపక్కలా ఎక్కడా కూడా సీతమ్మకి పుష్పాలు దొర‌క‌క‌పోవ‌డంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రీతిపాత్రమైనది. అంతేకాదు, సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ, ఆకాశంలో పయనిస్తూ, గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు ఆంజనేయుడు క‌చ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకుంటారు. దీంతో వానరులంతా హ‌నుమంతుడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఇక అప్పట్నుంచీ అంజని పుత్రుడికి తమలపాకులు అత్యంత ప్రీతిపాత్రమైపోయాయి. అందుకే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది తనను ఎవరైతే తమలపాకులతో అర్చిస్తారో వారి బాధలు తీరుస్తానని అన్నట్లు పెద్దలు చెప్తారు.

అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరతాయి. అంతేకాక తమలపాకే కాకూండా రకరకాల పువ్వులతో పూజ చేసిన హనుమంతుడు ప్రీతి చెందుతారు. హనుమంతుడు రకరకాల పువ్వులంటే ఎందుకు ఇష్టమో దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. అది ఏమిటంటే శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. అలాంటి సూర్యుడి వలన అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి. ఆ సూర్యభగవానుడే తనకి గురువు.ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వల్లనే పూలు వికసిస్తూ ఉంటాయి. అలాంటి పూలతో పూజలందుకోవడం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట, ఆనందంతో అనుగ్రహిస్తాడట. అందువల్లనే హనుమంతుడిని వివిధ రకాల తాజా పూలతో పూజించడం ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు.