Bakrid: దేశవ్యాప్తంగా ముస్లింలు నేడు బక్రీద్ పండుగును భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ( దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుసుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం దాగిఉంది.
ఇస్లాం క్యాలెండర్‌లోని బక్రీద్ మాసంలో 11వ రోజున ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి 80వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింల ఆరాధ్యగ్రంథం దివ్యఖురాన్ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం.ఖురాన్ ప్రకారం.. భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరుపొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ బలి కోరుతున్నాడమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా, మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్ దానికి సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి బలి ఇవ్వబోతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ అల్లాహ్ కు గొర్రెపిల్లను బలిఇస్తారు.
అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం భావిస్తున్నారు.అల్లాహ్ కు నైవేద్యం సమర్పించిన తర్వాత గొర్రె పిల్లను మూడు భాగాలుగా చేసి.. కొంత భాగం కుటుంబానికి, ఇంకొంత భాగం స్నేహితులకు, ఇంకొంచెం పేదలకు, అవసరమైన వారికి పంచి పెడతారు. ఈ మాంసంతో మటన్ కీమ్, మటన్ కుర్మా, మటన్ బిర్యానీ, కీర్, షీర్ కుర్మా వంటి వంటకాలను చేసి ఆరగిస్తారు.