Site icon Prime9

Astrology tips: శనివారం రావిచెట్టుకు పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయి..

Spiritual: రావి చెట్టుకు పూజలు చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎంతో పవిత్రమైన ఈ రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్టుకు పూజ చేయాలనుకునేవారు సూర్యోదయం తర్వాత నదీస్నానమాచరించి కుంకుమ ధారణ చేసి రావి చెట్టును పూజించాలి. అయితే రావిచెట్టును పూజించే ముందుగా గణపతిని సంకల్పం చేసుకుని ఆ తర్వాత రావి చెట్టుకు పూజ చేయాలి. రావిచెట్టుకు ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్ర నామాలను చదువుతూ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. సంధ్యాసమయంలో ఈ చెట్టును తాకకూడదు. కేవలం శనివారం మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసిన అనంతరం మనలో ఉన్న కోరికలను తెలియజేయడంతో కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సంతానం లేని వారు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి నిత్యం పూజ చేయటం వల్ల వారికి సంతానయోగం కలుగుతుందని అనాదికాలం నుంచి వున్న నమ్మకం.

రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి, దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు-కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. రావిచెట్టును పురుషుడుగాను, వేపచెట్టును స్త్రీగాను భావించి పూజించే ఆచారం అనాదిగా వస్తోంది. సాధారణంగా ఈ రెండు వృక్షాలు కలిసి గానీ, విడివిడిగా గానీ దేవాలయ ప్రాంగణంలో కనిపిస్తుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి భక్తులు వాటికి ప్రదక్షిణలు చేస్తుంటారు. పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణం చేయడం చాలా చోట్ల, చాలా కాలం నుంచి ఉన్నదే.

Exit mobile version