Secundrabad: కిలో గోల్డ్ తక్కువ ధరకే..! సినీ ఫక్కీలో భారీ మోసం

సికింద్రాబాద్ లో సినీ ఫక్కీలో భారీ మోసం
గ్యాంగ్ లో ప్రధాన సూత్రధారిగా 8వ బెటాలియన్ కానిస్టేబుల్
కిలో గోల్డ్ తక్కువ ధరకే ఇస్తామని వ్యాపారికి మాయమాటలు
చివరకు తాము పోలీసులంటూ ప్లేటు పిరాయించిన గ్యాంగ్
రూ.74 లక్షలతో ఉడాయించిన గ్యాంగ్
బాధితుల ఫిర్యాదుతో నిందితుల కోసం గాలింపు
నమ్మితే నట్టేట మునగడం ఖాయం. ఫ్రీగా ఇస్తున్నారని, తక్కువకే దొరుకుతుందని….వెళ్లేమా మోసపోవడం తథ్యం. ఇదే తరహాలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ ఫక్కీలో భారీ మోసం వెలుగు చూసింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పిన ఓ గ్యాంగ్ 74 లక్షల రుపాయలు కాజేసింది. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
కొంతమంది దుండగులు కిలో బంగారం తమ వద్ద ఉందని, తక్కువ ధరకు ఇస్తామని ఓ వ్యాపారిని సంప్రదించారు. డబ్బులు ఉన్నట్లు చూపిస్తే అమ్ముతామని నమ్మించారు. దీంతో వ్యాపారి 74 లక్షలు ఉన్నాయంటూ చూపించడంతో ప్లేట్ ఫిరాయించారు. తాము బాలాజీ నగర్ పీఎస్ కు చెందిన ఎస్ఓటీ పోలీసులమంటూ బురిడీ కొట్టించి, డబ్బులతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ గ్యాంగ్ లో 8వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ కేశవ్ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.