Credit Score: సమయానికి EMI చెల్లించినా క్రెడిట్ స్కోర్ తగ్గిందా ? కారణాలివే !

Credit Score: సిబిల్ స్కోర్.. నేటి ఆర్థిక ప్రపంచంలో చాలా ముఖ్యమైనది. లోన్స్, క్రెడిట్ కార్డులు పొందడానికి ఇది ఒక కీలకమైన కొలమానం. ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ.. సిబిల్ స్కోర్ తగ్గడం అనేది చాలా మందిని కలవరపరిచే విషయం. సాధారణంగా.. సరైన సమయంలో ఈఎంఐలు చెల్లిస్తే స్కోర్ పెరుగుతుందని భావిస్తారు. కానీ కొన్నిసార్లు అంచనాలకు భిన్నంగా స్కోర్ తగ్గుతుంది. దీనికి గల కారణాలు , వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు చూద్దాం.
సిబిల్ స్కోర్ తగ్గడానికి గల ప్రధాన కారణాలు:
క్రెడిట్ కార్డ్ వాడకం:
ఇది సిబిల్ స్కోర్‌పై అత్యంత ప్రభావం చూపే విషయాల్లో ఒకటి. మీ క్రెడిట్ పరిమితిలో మీరు ఎంత మొత్తాన్ని ఉపయోగిస్తున్నారో తెలిపేదే క్రెడిట్ వినియోగ నిష్పత్తి. ఉదాహరణకు.. మీ క్రెడిట్ కార్డు పరిమితి ₹1,00,000 అనుకుంటే.. మీరు ₹50,000 ఉపయోగించినట్లయితే.. ఎలాంటి నష్టం ఉండదు. ఇది 30% కంటే ఎక్కువగా ఉంటే.. మీ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. మీరు సకాలంలో ఈఎంఐలు చెల్లించినప్పటికీ.. మీ క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడితే స్కోర్ తగ్గుతుంది.
లోన్ అప్లై చేయడం:
మీరు తక్కువ సమయంలోనే.. ఎక్కువ లోన్స్ లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేస్తే.. ఇది మీ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రతి సారి మీరు అప్లై చేసినప్పుడు.. బ్యాంకులు మీ క్రెడిట్ నివేదికను “హార్డ్ ఎంక్వైరీ” చేస్తాయి. ఇలాంటి అనేక ఎంక్వైరీలు మీరు ఆర్థికంగా స్థిరంగా లేరని లేదా లోన్స్‌పై అధికంగా ఆధారపడుతున్నారని సూచిస్తాయి.ఇది స్కోర్‌ను చాలా వరకు తగ్గిస్తుంది.
గ్యారెంటర్‌గా ఉండటం:
మీరు వేరొకరి లోన్ లేదా క్రెడిట్ కార్డుకు గ్యారెంటర్‌గా ఉన్నప్పుడు.. వారి చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. వారు ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే.. అది మీ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
సిబిల్ స్కోర్ తగ్గకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- క్రెడిట్ వాడకం 30% లోపు ఉంచండి.
- అవసరం లేకపోతే కొత్త లోన్స్ కోసం అప్లై చేసుకోకండి.
- పాత క్రెడిట్ కార్డులను, అవసరం లేని వాటిని, అకస్మాత్తుగా మూసివేయకుండా ఉండండి.
- ఎవరికైనా గ్యారెంటర్‌గా ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.