Tata Motors: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ దిగ్గజం సుజుకీ వచ్చే నెల నుంచి తమ కార్ల ధరలు 4శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత, నిస్సాన్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ ధరను రూ. 4000 పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పుడు టాటా మోటార్స్ కూడా తన ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏ వేరియంట్‌పై ఎంత మేరకు పెంపుదల ఉంటుందో కంపెనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీనికి సంబంధించిన సమాచారం కూడా త్వరలో వెల్లడికానుంది.
ముడిసరుకు ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చుల కారణంగా వాహనాల ధరలను పెంచాల్సి వచ్చిందని టాటా మోటార్స్ పేర్కొంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, మా వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం టాటా మోటార్స్ అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో, కొత్త టాటా కారు కొనడానికి మీకు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.
మారుతి సుజుకి కూడా కార్ల ధరలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి కంపెనీ కార్ల ధరలు 4శాతం వరకు పెరగనున్నాయి. ఏయే మోడళ్ల ధరలను ఎంత మేర పెంచుతారనే దానిపై ఇప్పటి వరకు కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం కూడా ఈ నెలాఖరులోగా వెల్లడికానుంది.
మారుతి సుజుకి ఇప్పటికే ఫిబ్రవరి, జనవరి నెలల్లో వాహనాల ధరలను పెంచింది. ముడిసరుకు ధరలు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో వాహనాల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు మారుతీ కార్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు తమ జేబులు గుల్ల చేసుకోవాలి. మీరు మార్చి 31 లోపు కారు కొనుగోలు చేస్తే, మీరు ప్రయోజనం పొందుతారు. ఈ నెలలో కార్లపై మంచి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.