రాజధాని తరలింపు కు రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారా అని ప్రత్యేకంగా అడగడం హాస్యాస్పదమని యనమల పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం.. రాష్ట్రపతి ఆదేశాల మేరకే అమరావతి ని రాజధానిగా చేయడం జరిగిందని..తిరిగి రాజధానిని మార్చాలంటే.. రాష్ట్రపతి సంతకం తప్పనిసరి అని యనమల పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి చేసిన చట్టం, కేంద్రం కమిటీ ద్వారానే అమరావతి రాజధానిగా ఏర్పడిందని ఆయన అన్నారు.
సలహాదారులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి సంతకం ద్వారానే ఏపీ పునర్వవస్థీకరణ చట్టం వచ్చిందని యనమల గుర్తు చేసారు. రాజధానిని గుర్తించడానికి కేంద్రమే నిపుణలతో కమిటీ వేసిందని.. ఆ కమిటీ నిర్ణయిస్తేనే అమరావతి ని రాజధాని గా ప్రకటించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి సంతకం చేసిన చట్టం, కేంద్రం నియమించిన కమిటి ఆధారంగానే అమరావతి ని రాజధాని చేయడం జరిగిందని తెలిపారు.
కేంద్రం తెచ్చిన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రం చట్టం చేస్తే రాష్ట్రపతి సంతకం అవసరం అవుతుందని అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5(2) సబ్ సెక్షన్ 94(3), సెక్షన్ 94(4)లో కూడా రాజధాని గురించి, అందులో మౌలిక వసతుల గురించి స్పష్టంగా చెప్పారని యనమల చెప్పుకొచ్చారు. ఇవన్నీ వైసీపీ సలహాదారులు తెలుసుకొని.. రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వాలని ఆయన సూచనలు చేసారు. కేంద్ర చట్టాలతో ముడి పడిన అంశాలను పక్కన పెట్టి రాజధాని ని మార్చడం పై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని యనమల అన్నారు. శాసన మండలి సెలెక్ట్ కమిటి వద్ద రాజధాని అంశం ఇంకా పెండింగ్ లోనే ఉందని గుర్తు చేసారు. సెలెక్ట్ కమిటి వద్ద రెండు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వమే ఒప్పుకుందని.. తిరిగి వాటిని గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపిస్తే కోర్టు ని ధిక్కరించినట్లే అవుతుందని ఆయన ఆగ్రహించారు. ప్రభుత్వం ఇలా మొండి గా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని యనమల అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని, కేంద్ర చట్టాలను,కోర్టులను గౌరవించడం ప్రభుత్వాల ధర్మమని యనమల హితవు చెప్పారు.