అసలు ఏపీ ప్రభుత్వానికి ఏమైందంటూ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలా? అని నిలదీశారు. కోర్టు తీర్పులను ఎందుకు అమలుచేయటం లేదు? ఏపీ ప్రభుత్వానికి ఏమయ్యింది? గవర్నర్ జోక్యం చేసుకోవాలా.. ఇదేం తీరు? కేసుపై మాకు అవగాహన ఉంది? ఏపీలో అసలేం జరుగుతోంది? ఎవరు చెప్పినా వినం మా పాలన మా ఇష్టమంటున్న తాడేపల్లి రాజప్రసాదానికి ఈ మాటలు వినబడుతున్నాయా? ముఖ్యమంత్రి జగన్ గారూ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని దేవినేని ఉమ ఆరోపించారు. శనివారం కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్తులో జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైసీపీ ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోంది. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారు.
అక్రమ కేసులు పెట్టి నలంద కిషోర్ మరణానికి కారణమయ్యారు. నలంద కిషోర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి.’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.