విజయవాడ లో స్వర్ణ పాలస్ ను కొవిడ్ సెంటర్ గా ఉపయోగిస్తూ..కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. అయితే.. రమేష్ ఆసుపత్రి ఈ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వర్ణ పాలస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లో 40మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరిలో 30మంది కొవిడ్ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీపీ శ్రీనివాసరావు తెలిపారు. దట్టంగా అలుముకున్న పొగవల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కిటికీల్లోంచి కేకలు వేశారు.
ప్రస్తుతం అక్కడ గాయపడ్డ బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు.స్వర్ణ పాలస్ వద్ద ఇంకా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించడంతో అందులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల్లో మంటలు అలముకున్నాయి. అక్కడి నుంచి ఇతర అంతస్థులకు కూడా పొగలు వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కాపాడారు. NDRF సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి లోపలకి వెళ్లి మృతదేహాలను బయటకు తీసుకు వచ్చారు.