ఇకపైఆంధ్రప్రదేశ్ లో పౌరులు ఫిర్యాదు చేయాలంటే ఠాణా మెట్లెక్కాల్సిన పనిలేదు. కేసు ఏ దశలో ఉందోనని ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నిరసన తెలపాలన్నా, ధర్నా చేయాలన్నా అనుమతి కోసం అధికారుల కార్యాలయాలకు వెళ్లక్కర్లేదు. అరచేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు పోలీసులు అందించే సేవలను క్షణాల్లో పొందొచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ‘సురక్ష’ యాప్ను పోలీసు శాఖ రూపొందించింది. ప్రజలకు పోలీసు శాఖ అందించే 86 సర్వీసులను ఇందులో రూపొందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే ఈ యాప్ను ప్రారంభిస్తారని డీపీజీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
ఆయన డీజీపీగా బాధ్యతలను చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సురక్ష యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడమే కాకుండా కేసుల స్థాయి, వాటి దశలను తెలుసుకోవచ్చన్నారు. ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లను ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. గన్లైసెన్స్లకు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఏపీలో
ఏడు దిశ పోలీస్ స్టేషన్లు ఐఎస్ వో సర్టిఫికెట్ను దక్కించుకున్నాయి. దిశ యాప్ను ఇప్పటి వరకు 4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. స్పందనలో 75,610 ఫిర్యాదులు రాగా, 16,403 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 58,804 ఫిర్యాదులను పరిష్కరించారు. 403 పెండింగ్లో ఉన్నాయి. కేసుల్లో శిక్షల శాతం పెరిగింది. 2017లో 49.3, 2018లో 53.8, 2019లో 58.1శాతం శిక్షలు ఈ ఏడాది 64శాతానికి పెరిగాయి. నేరగాళ్లకు శిక్షలు పడేలా చేయడంలో దేశంలో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమ రవాణాను నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అద్భుతమైన పనితీరును కనబరచిందని డీజీపీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 6196 కేసులు నమోదు చేసి, 8141 మందిని అరెస్టు చేశారని వెల్లడించారు. మొత్తం 35,891 లీటర్లను మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యవస్థలు, వ్యక్తులపై దూషణలు చేస్తూ పోస్టింగ్లు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోస్టింగ్లు పెట్టే వారి విషయంలో వయసుతో సంబంధం లేదన్నారు.