పశ్చిమబెంగాల్లోని నందిగ్రాంలో వెయ్యి ఎకరాలకే అంత గొడవ జరిగితే.. అమరావతిలో ఇన్ని వేల ఎకరాలకు చిన్న సమస్య అని నిర్లక్ష్యంగా వదిలేస్తే ఇబ్బంది తప్పదు’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని భూ సేకరణలో నిజంగా అవకతవకలు జరిగి ఉంటే సరిచేసి ముందుకు తీసుకెళ్లాలి తప్ప.. ఇలా చేస్తే ఇంకో నందిగ్రాం అవుతుందని హెచ్చరించారు. 200 రోజులకుపైగా పోలీసు వ్యవస్థతో రైతులపై దాడులు జరిపించి.. ఆడవాళ్లు, చిన్న పిల్లలు అని లేకుండా.. విద్యార్థులు, వృద్ధులని లేకుండా లాఠీలతో కొట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు
జగన్ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానులు ఒక కలేనని పవన్ కల్యాణ్ అన్నారు. అధికారంలోకి వస్తే పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు చేస్తామని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సిందని తెలిపారు. అప్పుడు రాజధాని అమరావతికి రైతులు అన్ని వేల ఎకరాలు భూమి ఇచ్చేవారు కాదేమోనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రకరకాల కారణాలు చెప్పి రాజధాని మారుస్తామనడం రైతులను వంచించడమే మంచిది కాదు. వారితో ఎవరైనా కన్నీరు పెట్టిస్తే అది మలమల మాడ్చేస్తుంది’ అని హెచ్చరించారు.
గతంలో టీడీపీ నాయకులు సింగపూర్ తరహా రాజధాని అని చెప్పి కాన్సెప్ట్ ఎలా అమ్మారో.. ఈ అధికార వికేంద్రీకరణ కూడా మరో కాన్సెప్ట్ అమ్మడమే. ప్రజలకు ఒక కల చూపడం తప్ప వాస్తవంలో అవేవీ రూపుదాల్చవు’ అని చెప్పారు.
ఏపీలో ఇళ్లస్థలాలకు భూసేకరణలో చాలా చోట్ల అవకతవకలు జరిగాయని విమర్శించారు. రూ.7-8 లక్షలున్న భూమిని 4-7 రెట్ల ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని తప్పుబట్టారు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తూ ఉంటే వివిధ వర్గాల ప్రజల బాధలు తన దృష్టికి వచ్చాయన్నారు. అందుకే చాతుర్మాస్య దీక్షను కేవలం మనశ్శాంతి కోసం కాకుండా ప్రజలంతా బాగుండాలని మొదలుపెట్టానని చెప్పారు.
సాక్షాత్తూ మన హోం మంత్రి సుచిరిత దళిత వర్గానికి చెందిన వారని.. ఆమె హయాంలోనే దళితులపై దాడులు జరుగుతుంటే ఏమనుకోవాలని పవన్ ప్రశ్నించారు.పోలీసు శాఖలో కొందరు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కరోనా నేపధ్యంలో రెండు నెలలపాటు విధించిన లాక్డౌన్ సమయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులే అలా వచ్చి వెళ్లిపోతుందని అనడం సరికాదన్నారు. జాగ్రత్తలు చెబితే క్షేత్ర స్థాయిలో సామాన్య జనానికి కూడా కరోనా తీవ్రత అర్థమవుతుందని చెప్పారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చారు.