టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. శనివారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం బాగాలేకపోయినా కిషోర్‌ను కర్నూలుకు తీసుకెళ్లారని..కిషోర్‌ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇది పోలీసు హత్యగానే భావించాలని విమర్శించారు. కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు చూస్తే.. గత ప్రభుత్వమే బెటర్ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వేధింపులు గతంలో ఎప్పుడూ చూడలేదని.. ఇప్పుడు మరీ పరాకాష్టకు చేరిందన్నారు.
గుంటూరులో రంగనాయకమ్మ అనే పెద్దావిడపై కేసులు పెట్టి వేధించారని రఘురామ మండిపడ్డారు. పోలీసుల దమనకాండను.. ప్రభుత్వాధినేతగా జగన్ ఖండించాలన్నారు. రాజమండ్రి సమీపంలో శిరోముండనం కేసు, చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని యువకుడ్ని కొట్టి చంపారన్నారు.. ఇప్పుడు నలంద కిషోర్ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్ కరోనాతో మృతి చెందాడు. కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో, మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలకు.. వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. అనంతరం కర్నూలు పోలీస్ స్టేషన్ నుంచి కిషోర్ బెయిల్‌పై విడుదలయ్యారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కిషోర్ అత్యంత సన్నిహితుడు.