మాజీ ఎంపీ హర్షకుమార్ దళితుల పుట్టుక గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. నాలుక జాగ్రత్త పెట్టుకో’ అంటూ మంత్రి పినిపే విశ్వరూప్ మండిపడ్డారు.
‘దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు కాళ్ల మీద పడినప్పుడే హర్ష కుమార్ విలువ దిగజారిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు పెద్దపీట వేశారు. దళితుడు వరప్రసాద్ కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి మంత్రి విశ్వరూప్ హితవు పలికారు.
దళిత సమస్యలు ఎప్పుడు ఉత్పన్నమైనా మాజీ ఎంపీ హర్షకుమార్ తన స్వలాభానికే ఉపయోగించుకుంటున్నారని అమలాపురం ఎంపీ చింతా అనురాధ పేర్కొన్నారు. దళితులు అధికంగా ఉన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన దళితులకు ఏం చేశారో ప్రజలకు తెలుసని ఆమె విమర్శించారు.
దళితుల మీద ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు ఓ దళితుడిగా ఆయనకూ వర్తిస్తాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో దళితుల గురించి ఆయన చెప్పిన మాటలు ఎంత సత్య దూరమో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. చదువుకున్న వాళ్లం.. ప్రజాప్రతినిధులం.. మన పదజాలం, ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని హర్షకుమార్ విజ్ఞతకే... ఆయన మనః సాక్షికే వదిలేస్తున్నానని ఎంపీ అనురాధ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన నిరాధార వ్యాఖ్యలను హర్షకుమార్ వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.