ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు గుడ్ న్యూస్ .రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ మద్యం దుకాణాలు రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటాయి. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాత్రి 8 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంది. ఇందులో రాత్రి 7 గంటల వరకు లిక్కర్ అమ్మకాలు చేసి, చివరి గంట సేపు డబ్బుకు సంబంధించిన అకౌంట్లు చెక్ చేసుకుంటారు. తాజాగా, ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఇకపై రాత్రి 8 గంటల వరకు కస్టమర్లకు అమ్మకాలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మద్యం ధరలను బాగా పెంచి బార్ల సంఖ్యను తగ్గించారు.. అలాగే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం.. దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు ప్రభుత్వం నిర్ణయించిన సమయాల్లోనే జరుపుతున్న విషయం తెలిసిందే.
అయితే రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రజలు రోడ్లపైనే ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జే టాక్స్’ వసూళ్ల కోసం పరితపిస్తున్నారని విమర్శించారు. మద్యం దుకాణాలు రాత్రి 9 వరకు తెరిచి ఉంచాలన్న ఆదేశాలు దుర్మార్గమని మండిపడ్డారు.
మద్యం దుకాణాలు ఇప్పటికే కరోనా కేంద్రాలుగా మారిపోయాయన్నారు. ధరలు పెంచి మద్యపాన నిషేధం చేస్తున్నామని గొప్పలు చెప్పారని, రాత్రి 9 వరకు పెంచడం కూడా అందులో భాగమేనా అని లోకేశ్ వ్యాఖ్యానించారు.