ఆంధ్రప్రదేశ్: రాయలసీమ ఎత్తిపోతలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు కొత్తవి కావని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాసారు. కేడబ్ల్యూడీటీ(కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్)1 చేసిన కేటాయింపులు, 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల ప్రకారం మా వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులేనని స్పష్టం చేశారు. ఈ పథకం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా నీటిని వినియోగించుకుని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ చేపట్టామని రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కొత్తగా కాలువలు తవ్వడం, నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలుగానీ, అదనపు ఆయకట్టుగానీ చేర్చడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న కాలువల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టును స్థిరీకరించడం కోసమే దీన్ని చేపట్టామన్నారు.
ఎన్జీటీ(చెన్నై బెంచ్) నియమించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ, కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా పాత ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లందించడానికే చేపట్టారని నిర్ధారించాయని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కానే కాదన్నారు. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను ఆపేలా నియంత్రించకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టడానికి అవకాశం కల్పించాలని విజ్జప్తి చేసారు.
మరిన్ని వార్తలు చదవండి : అమిత్ షా అపాయింట్ మెంట్ రద్దవడం వల్లనే ...!