ఆంధ్ర ప్రదేశ్ : మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉద్దేశించిన వైఎస్సార్ చేయూత పథకాన్ని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ చేయూతను ప్రారంభించడం నా అదృష్టం. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఏ పథకం లేదు. వైఎస్సార్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలి. వీరికి ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకమూ లేదు. కానీ కుటుంబాలను నడిపించే బాధ్యత వీరిదే. వీరికి మంచి జరిగితే కుటుంబానికి మొత్తానికి మంచి జరిగినట్టే. వీరికి మంచి జరగాలనే ఈ పథకం.
నాలుగేళ్లపాటు చేయిపట్టుకుని నడిపిస్తాం అని చెప్పి ఈ పథకాన్ని తీసుకువచ్చాం. ప్రతి ఏటా రూ.18,750 చొప్పున రూ.75వేలు ఇస్తున్నాం. తమ జీవితాలను మార్పు చేసుకునే అవకాశం మహిళలకు వస్తుంది. దీన్ని ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పథకాన్ని వర్తింపు చేస్తామని చెప్పాం. మీ తమ్ముడిగా, అన్నగా చేయగలుగుతున్నాం. ఈ పథకంలో ఒక అడుగు ముందుకు వేశాం. అక్కల అకౌంట్లోకి నేరుగా బదిలీచేస్తున్నాం. పాత అప్పులకి జమచేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాల్లోకి పంపుతున్నాం. దీనికోసం బ్యాంకులతో మాట్లాడాం. దీంతో ఇంకో అడుగు ముందుకు వేశాం. అక్కలకు, చెల్లెమ్మలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేశాం.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లవరకూ ఉన్న మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల వరకూ ఇస్తున్నాం. ప్రతి ఏటా రూ.18750 లు ఇస్తాం. ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. అక్క, చెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడాలి.
60 ఏళ్లు వచ్చే వరకూ ఈపథకం కొనసాగుతుంది. అక్కడ నుంచి వారికి పెన్షన్ ప్రారంభం అవుతుంది. ఆ సమయానికి ఏడాదికి దాదాపు రూ.30వేల రూపాయలు వస్తాయి. 45 ఏళ్లు వయసు చేరుకున్న తర్వాత ప్రతి ఏటా మహిళలు ఈ పథకంలోకి వస్తారు. అక్కచెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా మీ కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం' అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు చదవండి : జగన్ లా లోకేష్ గెలవడం అసాధ్యం : రోజా