ఆంద్రప్రదేశ్ : నక్సలైట్లలో చేరి నా పరువు కాపాడుకుంటాను. నాకు అనుమతి ఇప్పించండి అంటూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్లో శిరోముండనానికి గురైన ఇండుగుమిల్లి ప్రసాద్ రాష్ట్రపతి గ్రీవెన్స్‌కు ఈ లేఖ రాశారు. గతనెల 18న సీతానగరం పోలీసుస్టేషన్లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తనకు ఎస్ఐ శిరోముండనం చేశారని, హింసించారని అందులో వివరించారు. నేను చాలా పేదకుటుంబానికి చెందిన వాడిని. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పు అయినట్లుంది. 22వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా శిరోముండనాన్ని సీరియ్‌సగా భావిస్తున్నట్టు ట్వీట్ చేశారు, కానీ 1 నుంచి 6 వరకూ ఉన్న ముద్దాయిలను మాత్రం ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు వీరే ప్రధాన కారకులు.
విషయాన్ని జిల్లా కలెక్టర్,
రాజమహేంద్రవరం ఎస్పీ కూడా పట్టించుకోవడంలేదు. ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు నాకు ఏవిధమైన సహాయమూ చేయలేదు. నేను దళితుడిని కావడం వల్లే న్యాయం జరగడంలేదు. నేను పరువు కాపాడుకుంటాను దయవుంచి నక్సల్స్‌లో చేరడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఇక్కడ శాంతిభద్రతలు విఫలమయ్యాయి అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్రపతి సెక్రటేరియట్‌కు చేరిందని, పరిశీలనలో ఉందని స్టేట్సలో తెలిపారు.
ఇలావుండగా మావోయిస్టులలో తనను చేర్చుకోండి అంటూ ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖపై ఏలూరు రేంజ్ డీఐజీ ఎ. మోహనరావు స్పందించారు. శిరోముండనం చేయించిన ఎస్ఐ, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని తెలిపారు. బాధితుడు వరప్రసాద్‌కు పోలీసు రక్షణ కల్పించామని చెప్పారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. చట్ట విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు చేసే వారి వెనుక ఎవరు ఉన్నారో తమకు తెలుసన్నారు. కొంతమంది లేని అంశాలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు చదవండి : ప్లాస్మా దానం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్