కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. చనిపోయిన శవాలనే కాదు.. బతికున్న మనుషులను కూడ పట్టించుకోవడం లేదు. కరోనాతో బాధపడుతున్నారో, సాధారణ జ్వరమో తెలియదు.అందుకే ఎందుకొచ్చిన గొడవంటూ దూరంగా జరుగుతున్నారు.
పశ్చిమ గోదావరి ఆకివీడు మండలం భీమవరం గ్రామం బస్టాప్ లో రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఒక వ్యక్తి భాధపడుతున్నాడు. అయితే కరోనా వైరస్ భయంతో ఎవరూ అతని దగ్గరికి కూడా వెళ్ళలేదు. 108 కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేట్ అంబులెన్సులకు కూడా ఫోన్ చేసారు. కానీ వారు కుడా స్పందించలేదు. ఇక చివరికి చెత్త బండిలో ఆకివీడు ప్రభుత్వాసుపత్రికి ఆ వ్యక్తిని తరలించారు.
తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని ఏలూరుకు తరలించారు. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామ రాజు స్పందిస్తూ.. తన సొంతూరిలో ఇలాంటి పరిస్దితి వచ్చినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నానని.. తనను క్షమించాలని కోరారు.
రాష్ట్రంలో వెయ్యికి పైగా అంబులెన్సులు ఏర్పాటు చేసినా.. అవి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్లాలని కోరారు.కరోనా కేసుల్లో దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుందని... రానున్న రోజుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
యాంటీ బాడీ టెస్టులు ఆలస్యమవుతున్నాయని... టెస్ట్ ఫలితాలు ఏడు రోజుల తర్వాత వస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అతి పెద్ద సమస్య కరోనానే అని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని... సాక్షాత్తు ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డారని అన్నారు.