తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసులో ఆరుగురు నిందితులను ఈ నెల 14 వ తేదీలోగా అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేసారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో ఎస్ఐ కాల్ లిస్ట్ బయటపెట్టాలన్నారు. బాధితుడికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి. సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలికకు న్యాయం జరిగేలా దిశచట్టం కింద కేసు పెట్టాలి. వీటిని నెరవేర్చకపోతే శిరోముండనం బాధితుడు ప్రసాద్ ఇంటి వద్ద నేనే స్వాతంత్య్ర దినోత్సవంనాడు నల్లజెండా ఎగరేస్తా అని ఆయన హెచ్చరించారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ వైఖరిపై హర్షకుమార్ నిప్పులు చెరిగారు. జగన్ పెద్ద మోసగాడు ఆయన వైఖరితో అన్ని వర్గాల వారూ బాధపడుతున్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నావు. శిరోముండనం కేసులో దోషులెవరో తెలిసినా అరెస్ట్ చేయడం లేదు. అందుకే నువ్వు నాకు పెద్ద మోసగాడిగా కనిపిస్తున్నావు అని ఆరోపించారు.