అనంతపురం : అనంతపురంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గాజుల మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా మారి కూడబెట్టిన ఆస్తి విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మనోజ్‌కుమార్ వద్ద మారణాయుధాలు ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు అందగా ఎస్పీ బి.సత్యయేసుబాబు ఈ నెల 18న డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, ఇ.శ్రీనివాసులు, ఎ.శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ ప్రసాద్, సీసీఎస్ సీఐ శ్యామ్‌రావు రంగంలోకి దిగారు. మనోజ్‌కుమార్ డ్రైవర్ నాగలింగ, అతడి మామ బాలప్ప ఇళ్లల్లో తనిఖీ చేయగా బాలప్ప ఇంట్లో 8 టంక్రు పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, భారీగా వెండి, నగదు, 4 డమ్మీ పిస్తోళ్లు, 18 రౌండ్ల బుల్లెట్లు లభించాయి. మనోజ్‌కుమార్ బెంగళూరు వెళ్లేందుకు ఖరీదైన హార్లీ డేవిడ్సన్ బైక్ వాడేవాడని దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా.
రూ.7 లక్షల విలువైన మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, రెండు కరిజ్మా బైక్స్, రెండు మహీంద్ర ఎక్స్‌యూవీ కార్లు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇవికాకుండా హోండా యాక్టివా, తాను పెంచుతున్న గుర్రాల కోసం లీజుకు తీసుకున్న వ్యవసాయ క్షేత్రంలో పనుల కోసం నాలుగు ట్రాక్టర్లు కూడా కొనుగోలు చేశాడు. సొత్తును స్వాధీనం చేసుకుని మనోజ్కుమార్పై కేసు నమోదు చేసి డీజీపీకి నివేదించామని,కేసును ఏసీబీకి అప్పగిస్తామని పోలీస్ శాఖ ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ మీడియాకు తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి (
ఇళ్లపట్టాలు ఆ స్థలాల్లో ఇవ్వొద్దు ..! )