ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు.
కొత్తగా తూర్పు గోదావరి జీజీహెచ్, పశ్చిమగోదావరిలో ఆశ్రం, గుంటూరు జీజీహెచ్, అనంతపూర్ జీజీహెచ్, శ్రీకాకుళం జీజీహెచ్ ఆస్పత్రులను రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. తద్వారా క్రిటికల్కేర్ కోసం 2380 బెడ్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతపూర్, శ్రీకాకుళం తప్ప మిగిలిన మూడు ఆస్పత్రులనూ క్రిటికల్ కేర్ సేవలు అందించడానికి సిద్ధం చేశామన్నారు. మొత్తంగా 8 ఆస్పత్రులు క్రిటికల్ కేర్ ఆస్పత్రులుగా మార్చామన్నారు.
కాగా, వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం వీటిని ఖర్చు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుని మరణాలు తగ్గిచండంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
రెమ్డెసివిర్, టోసీలిజుమబ్ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై దృష్టిపెట్టాలని సీఎం చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వెల్లడించారు. కోవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలకోసం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.