ఆంధ్ర ప్రదేశ్ : అంగన్వాడీ కేంద్రాలను రూ.4,000 కోట్లతో అభివృద్ధి చేసి నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూపు రేఖలు మార్చనున్నట్లు సీఎం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్న తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పరిశుభ్రమైన తాగు నీరు, రన్నింగ్ వాటర్‌తో బాత్‌రూమ్స్‌తోపాటు ఫర్నిచర్, ఫ్యాన్లు ఉండాలని సూచించారు. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, అంగన్వాడీలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా ఉంటాయని తెలిపారు. అంగన్వాడీల పాఠ్యప్రణాళికపై విద్యా శాఖ దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ విద్యపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు పలు సూచనలు చేసారు.
పిల్లలకు పాలు, గుడ్లు , తదితరాలు నిల్వ చేసేందుకు వీలుగా వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల (అంగన్వాడీ)లో ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీల్లో ఒకటో తరగతి పాఠ్యప్రణాళికతో ట్రాన్సిషన్ మొదలు కావాలి. అంగన్వాడీలకు ఇప్పుడున్న కనీస అర్హత పదో తరగతి కాగా వారికి ఏడాది పాటు డిప్లొమా కోర్సు నిర్వహించాలి. ఒకవేళ ఇంటర్, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారుంటే ఆరు నెలల డిప్లొమా కోర్సు ఉండాలి. సులభమైన మార్గాల్లో పాఠాలు బోధించడంపై శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు.
అంగన్వాడీలకు భవనాల నిర్మాణం, పాఠ్య ప్రణాళిక, టీచర్లకు డిప్లొమా కోర్సు, సులభమైన బోధనా పద్ధతుల్లో శిక్షణపై కార్యాచరణ సిద్ధం చేసి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల కోసం కొత్తగా రూపొందించిన పుస్తకాలను సమావేశంలో సీఎం పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం, చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అంగన్వాడీలను ఇదివరకు ఉన్న బీఎల్వో లాంటి విధుల నుంచి మినహాయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మరిన్ని వార్తలు చదవండి : నాన్నే నాకు స్ఫూర్తి.. : సీఎం జగన్