అమరావతి : అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు.. నిర్మాణాలన్నింటినీ ఆపేయడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం ఎంత తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతోపాటు పలు ఇతర అభ్యర్థనలతో గతంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన త్రిసభ్య ధర్మాసనం, వాటిపై గురువారం మరోసారి విచారణ జరిపింది. నిర్మాణాలపై చేసిన వ్యయం ప్రజల డబ్బు అని..,అది దుర్వినియోగమైతే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది.
ఖజానాకు వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు దానిని ఎలా రాబట్టాలన్న విషయాలను తదుపరి విచారణల్లో తేలుస్తామని తేల్చిచెప్పి తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలను కూడా 14న విచారణకు రానున్న వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.