ఆంధ్రప్రదేశ్ :దళితుడు ప్రశ్నిస్తే గుండు కొట్టిస్తారా? అని మాజీ మంత్రి, టీడీపీనేత
అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సీతానగరంలో బాధితుడు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాశాడంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చున్నారు.వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. దళితుల కోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క మంచి పని అయినా చేసిందా? అని ఆయన ప్రశ్నించారు.ఇళ్ల పట్టాల పేరుతో దళితుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ ఉందని వైసీపీ నేతలకు తెలుసా? ఆయన ఎద్దేవా చేశారు.
ఆదివాసీ దినోత్సవానికి గిరిజన శాఖా మంత్రి రాకపోవడం ఏంటని అయ్యన్న ప్రశ్నించారు. విశాఖ ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. కార్పోరేషన్ల నిధులను అమ్మఒడికి కేటాయించడమేంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని వైసీపీ ప్రభుత్వ తీరును అయ్యన్న తప్పుబట్టారు.
త్వరలోనే అయ్యన్న పాత్రుణ్ణి జైల్లో పెడతామని మంత్రి నాని అసభ్యంగా మాట్లాడారని ఒక మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అవి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా అటాక్ చేస్తారా? అని నిప్పులు చెరిగారు. మంత్రి అవంతి శ్రీనివాస్ నిజాయితీగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని అయ్యన్న ప్రశ్నించారు. ఏది అడిగినా విజయసాయి రెడ్డికి చెప్తానంటారేంటని విమర్శించారు. ముఖ్యమంత్రితో మాట్లాడే స్వేచ్ఛ కూడా మంత్రులకు లేదా? అని అయ్యన్న ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు చదవండి.