ఆంధ్రప్రదేశ్ : అయోధ్యలో రామభక్తుల వసతి కోసం ప్రత్యేక వసతి గృహాలు టీటీడీ నిర్మించేందుకు చర్యలు తీసుకునేలా చూడాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాసారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీ రామచంద్రుడిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలామంది రామభక్తులు అయోధ్యను సందర్శిస్తారు.
వారి సౌకర్యం కోసం టీటీడీ 100 గదులతో వసతి గృహం నిర్మించాలి. అయోధ్యలో వసతి గృహాలు, కల్యాణ మండపం, వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాలు కోసం మూడు ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంను కోరుతూ వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించక పోయినా టీటీడీ భూమి కొనుగోలు చేసి వసతి గృహాలు, కల్యాణ మండపం, వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణాలు చేపట్టాలి. అయోధ్యలో టీటీడీ నిర్మించతలపెట్టిన వసతి గృహాలు భక్తుల భాగస్వామ్యంతో నిర్మించవచ్చు. దీనివల్ల టీటీడీకి ఆర్ధికభారం పడదు.
అయోధ్యలో వసతి గృహం, కల్యాణ మండపం, వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలవడానికి కేబినెట్ మంత్రులతో, ఉన్నతాధికారులతో, టీటీడీ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్, చెన్నైలో టీటీడీ నిర్మించిన విధంగా అయోధ్యలో వెంకన్న దేవాలయం, వసతి గృహాలు, కల్యాణమండపం నిర్మించాలి అని జగన్‌ను రఘురాజు కోరారు.
మరిన్ని వార్తలు చదవండి.