ఆంధ్రప్రదేశ్ :చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చవకబారు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
జోగి రమేష్ మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజాన్ని ముఖ్యమంత్రి జగన్ నెలకొల్పారు. ముఖ్యమంత్రి చక్కటి పరిపాలన చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు కూడా ఈ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ వారికే లబ్ధి చేకూరింది. రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా 25లక్షలమంది మహిళలకు లబ్ది చేకూర్చారని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి అన్ని వర్గాలవారికి న్యాయం చేస్తున్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు సంక్షేమం అందిస్తున్నారు. 14 నెలల్లోనే 59వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కులాలు, మతాలకతీతంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు లబ్ధి చేకూరుతోంది. అయిదేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. మీ ఐదేళ్ల కాలంలో ఎస్టీలకు, మైనారిటీలకు మంత్రి పదవి కేటాయించని మీరు వారి సంక్షేమం కోసం మాట్లాడే నైతిక అర్హత లేదు.
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై కక్షలేదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. పవన్ కల్యాణ్ అభిమాని అనారోగ్యంతో ఉన్నారని ట్విటర్ పోస్ట్ చేసి ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించి 10 లక్షల రూపాయల వైద్య సాయం అందించారు. అని జోగి రమేష్ పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు చదవండి.