Breaking News

రాజ్యాంగ సంస్దలతో ఆటలా?ఏపీ సర్కారు పై సుప్రీం వ్యాఖ్యలు..!

10 th Jun 2020, UTC
రాజ్యాంగ సంస్దలతో ఆటలా?ఏపీ సర్కారు పై సుప్రీం వ్యాఖ్యలు..!

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రమేశ్ కుమార్‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

 ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగవని హెచ్చరించింది. ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవులతో ఆటలాడుకోవద్దని.. ఆర్డినెన్స్ తేవడంలో ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్ అభిప్రాయపడింది. ఆ ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తా.రని ప్రశ్నించింది.

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఆ నియామకం చెల్లదని ట్విస్ట్ ఇచ్చింది.. అలాగే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు కేవియెట్ దాఖలు చేశారు.

ఏపీ ప్రభుత్వ పనితీరు పై ఉన్నత న్యాయస్దానం కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. పంచాయతీ భవనాలకు రంగులు వేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు తీర్పు ఇవ్వడం ,దానిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం తెలిసిందే. అపుడు కూడ సుప్రీం కోర్టు హై కోర్టు తీర్పు ను సమర్దిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox